Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ అధినేత జగన్ రిషికేష్ వెళతారా ? ఔననే తెలుస్తోంది. దీని వెనుక ఓ స్వామీజీ హ్యాండ్ ఉందట. కారణం కూడా పెద్దదే అని తెలుస్తోంది. విశాఖ, శారద పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర చాతుర్మాస దీక్ష కోసం రిషికేష్ కి వెళ్తున్నారు. ఆ ప్రయాణంలో భాగంగా ప్రస్తుతం కాశీలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో జరిగే పరిణామాల మీద, రాజకీయ వ్యవహారాల మీద స్వరూపానందకి ఆసక్తి ఎక్కువ. ఎంత దాచుకుందామన్నా ఆయనకి చంద్రబాబు సర్కార్ మీద వున్న కోపం, జగన్ మీద ప్రేమ దాగవు. ఏపీ లో జగన్ పాలన రావాలని కోరుకునే ఆ స్వామి కిందటేడాది ఎప్పుడూ లేని విధంగా జగన్ ని రిషికేష్ రప్పించి ఆయనతో ప్రత్యేక పూజలు చేయించగలిగారు. అంతకుముందు ఇలాంటి శాంతి పూజలు లాంటి వాటికి దూరంగా వుండే జగన్ స్వామి మాట కాదనలేకపోయారు.
కిందటేడాది జగన్ రిషికేష్ పర్యటనలో ఉండగానే వేరే పని మీద అక్కడికి వచ్చిన బీజేపీ నేత యెడ్యూరప్ప తో విజయసాయి ఓ హోటల్ లో భేటీ అయ్యారట. దాని ఫలితమే ఇటీవల జగన్ కి మోడీ ఇచ్చిన అపాయింట్ మెంట్ అని ఓ టాక్. ఆ భేటీ సక్సెస్, ఫెయిల్యూర్ అని చెప్పేకన్నా దాని ప్రభావం టీడీపీ, బీజేపీ సంబంధాలపై ఎలా పడిందో చూస్తూనే వున్నాం. ఇప్పుడు కూడా స్వరూపానంద తన చాతుర్మాస దీక్ష టైం లో ఇంకోసారి జగన్ తో ప్రత్యేక పూజలు చేయించాలని తలపోస్తున్నారట. 2019 ఎన్నికల్లో విజయమే ప్రాతిపదికగా ఏ అడుగులు వేయడానికైనా సిద్ధంగా వున్న జగన్ కూడా స్వరూపానంద అడిగితే కాదనే ప్రసక్తే లేదంటున్నారు. మొత్తానికి ఈ వ్యవహారాలు చూస్తుంటే రాజరికంలో రాజగురువుల మాట చెల్లినట్టే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఇలాంటి స్వామీజీలు ఏదో రకంగా పార్టీలని ప్రభావితం చేస్తున్నారు.