Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చారిత్రక కట్టడాలపై బీజేపీ సరికొత్త వాదన కొనసాగుతోంది. నిన్నటిదాకా తాజ్ మహల్ గత చరిత్రకు కొత్త భాష్యం చెప్పిన బీజేపీ నేతలు ఇప్పుడు ఢిల్లీలోని జామా మసీదుపై దృష్టిపెట్టారు. తాజ్ మహల్ మొఘల్ చక్రవర్తి షాజహాన్ ప్రేమకు గుర్తుగా నిర్మించిన కట్టడం కాదని…అది ఒకప్పుడు శివాలయమని, దాని పేరు తేజోమహాలయ్ అని వ్యాఖ్యానించిన బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ ఇప్పుడు జామా మసీదు చరిత్రకూ కొత్త భాష్యం చెబుతున్నారు. దేశరాజధానిలో ప్రసిద్ధిగాంచిన జామా మసీదు కూడా ఒకప్పుడు హిందూ దేవాలయమే అన్నారు.
అది ఒకప్పటి జమునాదేవి ఆలయమని, మొఘల్ చక్రవర్తులు నాశనం చేసి జామా మసీదు కట్టారని వినయ్ కతియార్ ఆరోపించారు ఈ ఒక్క ఆలయాన్నే కాదని, దేశవ్యాప్తంగా దాదాపు 6వేలకు పైగా కట్టడాలను మొఘలులు నేలమట్టం చేశారని ఖతియార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజానికి ఖతియార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత పరిస్థితుల్లో వివాదాస్పదంగా అనిపించినప్పటికీ అవన్నీ చారిత్రక సత్యాలే. ఈ దేశంపై దాడి చేసిన ఎందరో ముస్లిం రాజులు అనేక ఆలయాలు సహా చారిత్రక కట్టడాలను ధ్వంసం చేశారని పుస్తకాల్లో రాసి ఉంది కూడా. గజని, ఘోరీ మొదలుకుని బాబర్, అక్బర్, ఔరంగజేబు దాకా ఎందరో ముస్లిం సుల్తాన్ లు, మొఘల్ చక్రవర్తులు తమ మతాన్ని వ్యాప్తిచేసేందుకు హిందువులను అణగదొక్కి, వారి సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేవాటిని నామరూపాల్లేకుండా చేశారు.
ఆ స్థానంలో మసీదులు నిర్మించుకున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా కాలక్రమంలో ఆ కట్టడాలు భారత సంస్కృతిలో ఓ భాగమైపోయాయి. సామాన్య ప్రజలు కూడా వాటిని మన దేశానికి చెందిన చారిత్రక చిహ్నాలుగానే భావిస్తున్నారు. అందుకే బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు ప్రజల మద్దతు దొరకడం లేదు. దీనికి కాంగ్రెస్ వైఖరి కూడా మరో కారణం. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ఆ పార్టీ సెక్యులర్లమన్న పేరుతో తమ రాజకీయ అవసరాల కోసం చారిత్రక వాస్తవాలను మరుగున పరిచింది. ప్రజల్లోకి తప్పుడు అభిప్రాయాలను చొప్పించింది.