వైసీపీ, జనసేన కలిస్తే మంచి రాజకీయ శక్తి !

తెలంగాణా ఎన్నికలు తదానతర పరిణామాల మీద మాజీ ఎంపీ సబ్బంహరి తనదైన శైలిలో స్పందించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఇదే రాజకీయ పరిస్థితి కొనసాగితే తిరిగి చంద్రబాబు రాష్ట్రంలో సీఎం అవుతారని అన్నారు. రాష్ట్రానికి మేలు చేసే కార్యక్రమాలను చంద్రబాబు చేస్తున్నారన్న అభిప్రాయం ప్రజలకు ఉందని, పార్టీ పరంగా కూడా వైసీపీ కంటే టీడీపీకే గెలిచేందుకు అవకాశం ఉందని చెప్పారు. బీజేపీ రాష్ట్రాన్ని మోసం చేసిందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చంద్రబాబు విజయం సాధించారని, అందుకే చంద్రబాబును ఓడించడానికి బీజేపీ సర్వశక్తులూ ప్రయత్నిస్తోందని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ గెలుపునకు తెరవెనుక బీజేపీ సహకరించిందని ఆరోపించారు.

చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కేసీఆర్ ఆంధ్ర వస్తే ఇక్కడ చంద్రబాబే గెలుస్తారని అభిప్రాయపడ్డారు. వైసీపీ, జనసేన కలిస్తే రాష్ట్రంలో మంచి రాజకీయ శక్తిగా అవతరిస్తుంది కానీ, ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న నేపథ్యంలో వారిద్దరూ కలుస్తారన్న నమ్మకం తనకు లేదన్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరు సీఎం కుర్చీ త్యాగం చేసే పక్షంలో మాత్రమే వారిద్దరూ జట్టు కట్టడం సాధ్యమని చెప్పారు. అదేవిధంగా తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తిరిగి రాబోతున్నట్లు తెలిపారు. తాను ఏ పార్టీలో చేరేది కొద్ది రోజుల్లో వెల్లడిస్తానని చెప్పారు.