పవన్ కూడా కుల రాజకీయాలు మొదలెట్టారా ?

Janasena pawan Kalyan entering kapu politics

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రాజకీయాలకు కులం ఆలంబన కావచ్చు… కానీ రాజకీయాల్లో విజయం సాధించాలి అంటే కులం ఒక్కటే మార్గం అదే బలం అనుకుంటే అంత కంటే మూర్ఖులు ఉండరు. ఇది చాలా వరకు ప్రూవ్ అయిన నిజం. దేశం మాట ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కులాన్ని చూపించి ఓట్లు కొల్లగొట్టి అధికారం అందుకుందామనుకున్న వారు విజయాలు సాధించింది మాత్రం అరుదే. అంతెందుకు తెలుగునాట అన్ని వర్గాల వారిని ఆకర్షించగలిగాడు కాబట్టే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన తన కులాన్నే నమ్ముకుని రాజకీయం చేసుంటే ఈ పాటికి ఆయన పేరు కూడా కనుమరుగు అయ్యుండేది ఏమో ? ఆయన ఏనాడు అటువంటి కుల రాజకీయాలను ప్రోత్సహించలేదు.

కులం, మతం కన్నా కూడా సిద్ధాంతాల పట్ల నమ్మకం, పార్టీ అధినాయకుల మీద ఉన్న నమ్మకం వారి మీద ఉన్న అభిమానంతోనే రాజకీయాలు నడిచేవి. ఇన్నేళ్ళ ఆంధ్ర రాజకీయ చరిత్రలో కులపరంగా ప్రజలు చీలిన సందర్భాలు లేవు. ఉదాహరణకి ఒక నాయకుడిని లేదా ప్రభుత్వాన్ని ప్రజలు అభిమానించినా వ్యతిరేకించినా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫలితాల సరళి ఒకే విధంగా వుండేది. అంటే ఒక ప్రభుత్వం ఎన్నికలకి వెళితే అన్ని జిల్లాలలోను ఒకే విధమైన ఓటింగ్ జరిగేది ఒకవేళ కులాల ఆధారంగా ఓట్లు చీలితే అవి అలా వచ్చేవి కాదు కదా ! 2009 ఎలక్షన్‌ల ముందు దాకా కూడా రాష్ట్రంలో ఇదే వాతావరణం కొనసాగింది. ఎప్పుడయితే చిరంజీవి రాజకీయ తెరంగ్రేటం చేసాడో అప్పటి నుండి కూడా ఆంధ్రాలో కుల రాజకీయాలు మొదలయ్యాయి అని చెప్పాలి. అయితే నేతలు ఎక్కడా కుల ప్రస్తావన లేకుండా సాగినప్పటికీ అప్పటి వరకు తమ సామాజిక వర్గం నుండి ఎవరూ సీఎం అవలేదని భావించిన కాపు వర్గీయులు కోస్తాలోని కొన్న్ని చోట్ల చిరంజీవి పార్టీకి ఓట్లు వేశారు అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాడానికి కాకుండా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు వారి ఓట్లు ఉపయోగపడ్డాయి అని విశ్లేషకులు భావుంచేవారు.

ఇక తదుపరి పరిణామాల్లో రాష్ట్రంలో కుల రాజకీయాలకు బీజం పడింది. తెలుగుదేశంకు ఒక కులం, వైకాపాకు ఒక కులం ముద్ర వేశారు. పవన్‌ కళ్యాణ్‌ను రంగంలోకి దించడం ద్వారానేమీ, కాపు రిజర్వేషన్‌ల హామీతోనైతేనేమీ కాపుల ఓట్లను తెలుగు దేశం రాబట్టింది. అయితే ఇప్పుడు పవన్ తన పార్టీలో చేపట్టిన కొన్ని నియామకాలని చూస్తే పవన్ మొదటి నుండి చెప్తున్న మాటల మీద అనుమానం రావడం మొదలయ్యింది. రాజ‌కీయాల్లో అందరూ చెప్పేది ఒక‌టి చేసేదొక‌టి ఇప్పుడు పవన్ కూడా ఈ సిద్దంతాన్నే అనుస‌రిస్తున్నాడు అనిపిస్తోంది. 2014లోనే పార్టీ స్థాపించినా… అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మౌనంగా ఉండిపోయిన ప‌వ‌న్… ఇప్పుడు 2019 ఎన్నిక‌ల నేప‌థ్యంలో దూసుకుపోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టుగా ఆయన చేస్తున్న పర్యటనలు చెప్పకనే చెబుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఏపీలో ప‌ర్య‌ట‌న చేస్తున్నాడు. ఇక‌, ఈ స‌మ‌యంలోనే ప‌వ‌న్ కొన్ని వ్యాఖ్య‌లు చేస్తున్నాడు. త‌న‌కు కులం అంటే గిట్ట‌ద‌ని, తాను కుల రాజ‌కీయాల‌కు వ్య‌తిరేక‌మ‌ని, మ‌నుష‌లంద‌రిదీ ఒకే కుల‌మ‌ని చెప్తూ కులాల రొచ్చు లేని సమాజాన్ని స్థాపిస్తానని అంటుంటే నిజమే అనుకున్నారు కానీ ఇప్పుడు ప‌వ‌న్ లోని రాజ‌కీయ నేత నిద్ర‌లేచిన‌ట్టుగా క‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

పవన్ చుట్టూ ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఉన్నారన్నది రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికీ అయిన ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయనకు సలహాలు ఇచ్చే వారి దగ్గర నుంచి… ఈ మధ్యనే తన రాజకీయ వ్యూహకర్త అంటూ పరిచయం చేసిన వ్యక్తి నుంచి ఆయన సన్నిహితులుగా వ్యవహరించేవారు… ఆయనకు కొన్ని సూచనలు ఇచ్చేందుకు నియమించుకున్న వారిలో అత్యధికులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూరేలా తాజా నియామకం ఉందని చెప్పక తప్పదు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా తోట చంద్రశేఖర్ ను నియమిస్తూ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. తాను తీసుకున్న నిర్ణయానికి సంబంధించి అధికారికంగా ప్రకటనను కూడా విడుదల చేశారు. తోట చంద్రశేఖర్ తో పవన్ కు గడిచిన పదేళ్లుగా వ్యక్తిగత సాన్నిహిత్యం ఉందని పవన్ వెల్లడించారు.

గతంలో ఇండియన్ సివిల్ సర్వీసెస్ లో పనిచేసిన ఆయన 2014 లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. తెలుగుదేశం అభ్యర్థి మాగంటి బాబు చేతిలో ఓడిపోయారు. అంతకు ముందు కూడా ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన తరవాత చంద్రశేఖర్ వైసీపీని వీడి జనసైనికుడిగా మారారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల లెక్కల తేల్చేందుకు పవన్ ఏర్పాటుచేసిన జాయింట్ ఫ్యాక్ట్స్ కమిటీ (జేఎఫ్‌సీ)లో సభ్యుడిగా కూడా ఉన్నారు. ఇప్పుడు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇటీవల కాలంలో పార్టీ నియామకాలన్నీ ఒకే సామాజిక వర్గానికి చెందినవన్న విమర్శ వినిపిస్తోంది. దీని పై పవన్ దృష్తి పెడితే మంచిది లేదంటే ప్రజారాజ్యానికి ముద్ర పడినట్టు జనసేన మీద కూడా కులం ముద్ర పడే అవకాశం ఉంది