టీఆర్ఎస్ నేత డీఎస్ పై ఆ పార్టీ నిజామాబాద్ నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మరోపక్క ఆయన టీఆర్ఎస్ను వీడి మళ్లీ కాంగ్రెస్లో చేరతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన కాసేపట్లో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ను కలవనున్నారు. ఈరోజు మధ్యాహ్నం దాకా ఆయన అపాయింట్మెంట్ ని ఓకే చెయ్యని ప్రగతి భవన్ కొద్దిసేపటి క్రితం ఆయనకు అపాయింట్మెంట్ ఖరారు చేసిందని సమాచారం. బీజేపీలో ఉన్న తన కుమారుడికి అనుకూలంగా డీఎస్ వ్యవహరిస్తున్నారని కొందరు టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
ఈ విషయమై డీఎస్ ను మీడియా ప్రశ్నించగా.. ‘ఈ పరిస్థితుల్లో ఇప్పుడేమీ చెప్పలేను… నో కామెంట్’ అని బదులిచ్చారు. అసలు, జిల్లా నేతలు తనపై అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలియదని, ఆ విషయం వారినే అడగాలని అన్నారు. అలాగే సీఎంకు ఫిర్యాదు చేసుకుంటే చేసుకోమనండి’ అని అన్న డీఎస్, తాను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ వ్యవహరించలేదని అలాగే ‘నేతలు నాపై చేసింది ఫిర్యాదు మాత్రమే కదా, నా గొంతు కోస్తామని చెప్పులేదుగా’ అని డీఎస్ వ్యాఖ్యానించడం గమనార్హం.