ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ మార్చిలో మొదలు పెడతామని బాలకృష్ణ ప్రకటించగానే అందరి దృష్టి ఇంకోసారి లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంధం సినిమాల మీదకు కూడా మళ్లింది. ఆ సినిమాల గురించి ఎక్కడా వినబడడం లేదే అన్న చర్చ కూడా మొదలైంది. ఎన్టీఆర్ జీవితాన్ని లక్ష్మీపార్వతి కోణంలో చూపిస్తానని “లక్ష్మీస్ ఎన్టీఆర్ “ సినిమా అనౌన్స్ చేసిన వర్మ ఇప్పుడు ఆ విషయమే మర్చిపోయి నాగ్ తో సినిమాతో పాటు పోర్న్ స్టార్ మియా మాల్కోవతో గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ అనే వీడియో రూపకల్పనలో బిజీగా వున్నాడు. ఇక “లక్ష్మీస్ ఎన్టీఆర్ “ ఆయన తీస్తాడో, లేదో ఇప్పుడే చెప్పలేం. ఈ సినిమాకు కధా వస్తువు అందించిన లక్ష్మీపార్వతి సైతం వర్మ ని ఏకిపారేయడం చూస్తుంటే ఈ సినిమా మీద అపనమ్మకం కలగడం సహజం.
ఇక “లక్ష్మీస్ వీరగ్రంధం “ పేరుతో ఎన్టీఆర్ జీవితంలోకి రాక ముందు లక్ష్మీపార్వతి జీవితం ఏమిటో చూపిస్తానని నానా హడావిడి చేసిన దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కూడా కొన్నాళ్లుగా సైలెంట్ అయ్యారు. ఇక ఆ సినిమా కూడా అటక ఎక్కినట్టే అనుకుంటుంటే సదరు కేతిరెడ్డి నిన్న తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకుని సరికొత్త విషయం బయటపెట్టాడు. లక్ష్మీపార్వతి సినిమా గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా శశికళ, జయలలిత మధ్య బంధాన్ని తెలిపే “శశిలలిత” అనే పేరుతో సినిమా తీయబోతున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమాలో ఇప్పటిదాకా జనానికి తెలియని ఎన్నో విషయాలు బయట పెడతా అంటున్నాడు కేతిరెడ్డి. ఈ ప్రకటన మీద తమిళుల ప్రతిస్పందన ఎలా ఉంటుందో ?