తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులపై శ్రీరెడ్డి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆమె నోరు మూయించేందుకు కొందరు దర్శకులు ఆమెకు ఆఫర్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఆ సమయంలోనే ఆమె నోరు మరింతగా పారేసుకోవడంతో వచ్చిన ఆఫర్లు కూడా చేజారి పోయాయి. తెలుగులో శ్రీరెడ్డికి ఛాన్స్‌లు రావడం అసాధ్యం అయిపోయింది. ఒకవేళ శ్రీరెడ్డికి ఛాన్స్ ఎవరైనా ఇస్తే కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకే ఆమెకు తెలుగులో ఛాన్స్‌లు అనేది అసాధ్యం. ఇక తమిళనాట ఈమద్య శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేస్తుంది. ప్రముఖులపై ఈమె చేస్తున్న ఆరోపణలు అక్కడ రచ్చ రచ్చ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీరెడ్డి నోరు మూయించేందుకు కోలీవుడ్‌లో ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కోలీవుడ్ స్టార్స్‌పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూనే కుట్టి పద్మిని అనే నిర్మాత ఛాన్స్ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. శ్రీరెడ్డి విషయంలో తనకు జాలీ వేస్తుందని, ఆమె చాలా ఇబ్బందులు పడ్డట్లుగా తాను గుర్తించాను, తమిళ సినీ ఇండస్ట్రీలో కొందరు ఆమె పట్ల దారుణంగా వ్యవహరించి ఉండవచ్చు, అంచేత మొత్తం ఇండస్ట్రీని శ్రీరెడ్డి తప్పుపట్టడం మంచి పద్దతి కాదని కుట్టి పద్మిని అన్నారు. సీరియల్స్, సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇలా పలు రంగాల్లో నిర్మాతగా వ్యవహరిస్తున్న కుట్టి పద్మిని బ్యానర్లో చేసేందుకు ఎంతో మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పద్మిని నిర్మించే సీరియల్స్‌లో నటించాలని సినీ తారలు కూడా కోరుకుంటారు అంటే ఈమె క్రేజ్ ఎంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే తమిళనాట శ్రీరెడ్డికి మంచి బ్రేక్ లభించడం ఖాయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పద్మినిని రంగంలోకి దించి శ్రీరెడ్డికి అవకాశాలు ఇప్పించి, ఆమె నోరు మూయించాలని కొందరు ప్రయత్నించి సఫలం అయినట్లుగా తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పద్మిని ఆఫర్‌పై శ్రీరెడ్డి ఎలా స్పందిస్తుందనేది చూడాలి.