రాబోవు తెలంగాణ ఎన్నికల సమరంలో మొదటి మరియు కీలకమైన అభ్యర్థుల నామినేషన్ దాఖలు అనే ఘట్టం ఈరోజు తో ముగుస్తుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ ను నవంబర్ 12 న విడుదల చేసిన రోజునుండి అభ్యర్థుల నామినేషన్ల స్వీకరింపు జరుగుతూనే ఉంది. కాగా, ఈ నామినేషన్ల దాఖలు గడువు ఈరోజు అనగా సోమవారం 19 నవంబర్ న మధ్యాహ్నం 3 గంటలతో ముగుస్తుంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1497 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పాత్రలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించినట్లుగా తెలుస్తుంది. వారిలో తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ మరియు తెరాస పార్టీ ఎన్నికల అభ్యర్థులు, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ప్రజకూటమి తరపున నిలబడే అభ్యర్థులు ఉన్నారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ నిన్న ప్రకటించిన తుది జాబితాలోని అభ్యర్థులు కూడా ఈరోజు నామినేషన్లు సమర్పించబోతున్నారు. శుభముహూర్తాలు, మంచిరోజులు అనే నమ్మకాలు గల అభ్యర్థులు కూడా తమ తమ కుటుంబీకులు మరియు అనుచరుల ధ్వారా తమ తమ నామినేషన్లను దాఖలు చేయించారు.ఈరోజు మధ్యాహ్నం వరకే గడువు ఉండడంతో ఈరోజు నామినేషన్ల దాఖలు వేయడానికి వచ్చే అభ్యర్థులు అట్టహాసంగా తమ కార్యకర్తలు మరియు అనుచరగణం తో బయలుదేరివెళ్తున్నారు. వీరే కాకుండా, బీఫారాలు సమర్పించకుండా తమ నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఈరోజు గడువు లోగా తమ బీఫారాలను సమర్పించాల్సి ఉంటుంది.నామినేషన్ల గడువు పూర్తి కాగానే, రేపటినుండి అభ్యర్థుల నామినేషన్ల పత్రాల పరిశీలన చేపడతారు. ఈరోజు నుండి కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అందుబాటులో ఉంటారు.
ఇప్పటికే 68 మంది సాధారణ పరిశీలకులు మరియు 10 మంది శాంతిభధ్రతల పరిశీలకులు జిల్లాలకు చేరుకొని, రెండు, మూడు నియోజకవర్గాలకు ఒక సాధారణ పరిశీలకుడు మరియు ఉమ్మడి జిల్లాలకు ఒక పరిశీలకుడు చొప్పున పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చి, తమ బాధ్యతలు నిర్వర్తిస్తారు. అలాగే నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 21, 22 తేదీలలో గడువు ఉంటుంది. గతనెల 12 వ తేదీన ఓటర్ల తుది ప్రకటించిన ఎన్నికల కమిషన్ అర్థులైనా వారు తమ ఓటు హక్కు నమోదు కోసం నవంబర్ నెల 9 వరకు అవకాశం ఇచ్చింది. ఇప్పటికే నాలుగు లక్షలకు పైగా దరఖాస్తులు అందగా, లక్షా యాభైవేల కొత్త ఓటర్లకు అవకాశం లభించింది. ఈ అనుబంధ జాబితాను ఈరోజున ప్రకటిస్తున్నారు.