గత కొంత కాలంగా కంటి కురుపుతో బాధపడుతున్న నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బుధవారం ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. కంటి సమస్యతో పది రోజుల క్రితం వైద్యులను పవన్‌కల్యాణ్ సంప్రదించారు. ఎడమ కంటిలో కురుపు అయిందని దానికి శస్త్ర చికిత్స చేయడమే మార్గమని వైద్యులు సూచించారు. బుధవారం పవన్ ఆస్పత్రిలో చేరగా శస్త్రచికిత్స ద్వారా పవన్ కంటికి ఉన్న కురుపును వైద్యులు తొలగించారు. గురువారం సాయంత్రం పవన్‌ను డిశ్చార్జి చేశారు. ఈ సందర్భంగా రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని పవన్‌కు వైద్యులు సూచించినట్లు సమాచారం. ఈనెల 16 నుంచి తూర్పుగోదావరి ప్రజాపోరాట యాత్రలో పవన్ పాల్గొనాల్సి ఉంది.
ఆ పోరాటంలో పవన్ పాల్గొంటాడా లేదా అనే క్లారిటీ నేడు జనసేన పార్టీ ఇస్తుందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. పవన్ తన కంటికురుపు గురించి గత నెలలో జరిగిన రంగస్థలం సక్సెస్ మీట్ లో తొలిసారి చెప్పారు. కంటి సమస్యకు సర్జరీ అవసరమని వైద్యులు అప్పుడే సూచించగా పవన్ ప్రజాపోరాట యాత్ర కారణంగా ఆ ఆపరేషన్ వాయిదా పడుతూ వచ్చింది. పవన్ ఎట్టకేలకు బుధవారం ఆపరేషన్ చేయించుకున్నారు. శస్త్ర చికిత్స కారణంగా బస్సు యాత్రకు పవన్ కొంత విరామం ప్రకటించారు. ఈనెల 26 నుంచి తిరిగి యాత్ర ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.