Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
లోక్ సభ లో సేమ్ సీన్. ఇవాళ కూడా అవిశ్వాసం చర్చకు రాలేదు. విరామం అనంతరం ఈ ఉదయం పార్లమెంట్ ఉభయసభలూ ప్రారంభమయ్యాయి. లోక్ సభ మొదలు కాగానే కావేరీ బోర్డు అంశంపై అన్నాడీఎంకె సభ్యులు ఆందోళన చేపట్టారు. వెల్ లోకి దూసుకొచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను తొలుత మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అనంతరం సభ మొదలైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. అన్నాడీఎంకె సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో అంశాలపై చర్చించాల్సి ఉన్నందున సభ్యులు సభ నిర్వహణకు సహకరించాలని స్పీకర్ కోరారు. గందరగోళం మధ్యే టీడీపీ, వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను స్పీకర్ సభలో చదివి వినిపించారు. సభ సజావుగా సాగితేనే అవిశ్వాస తీర్మానాలపై చర్చ చేపట్టేందుకు వీలవుతుందన్నారు.
సభలో ఆందోళనల మధ్యే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ మాట్లాడారు. సభలో అన్ని అంశాలపై చర్చ చేపట్టేందుకు కేంద్రం సిద్దంగా ఉందని, సభ్యులు ఆందోళన విరమించి సభ నిర్వహణకు సహకరించాలని కోరారు. సభ్యులంతా తమ సీట్లలోకి వెళ్లి కూర్చోవాలని స్పీకర్ విజ్ఞప్తిచేశారు. సభ్యుల ఆందోళనల వల్ల అవిశ్వాసానికి మద్దతిస్తున్న ఎంపీల సంఖ్య లెక్కించలేకపోతున్నానని చెప్పారు. అయినప్పటికీ అన్నాడీంఎకె సభ్యులు వెనక్కి తగ్గలేదు. నినాదాలు కొనసాగించారు. దీంతో స్పీకర్ సభ ఆర్డర్ లో లేనందువల్ల రేపటికి వాయిదావేస్తున్నట్టు ప్రకటించారు. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. ఈ ఉదయం సభ ప్రారంభంకాగానే టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు చేతబూని చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, సభా నిర్వహణకు సభ్యులు సహకరించాలని చైర్మన్ వెంకయ్యనాయుడు పదే పదే కోరినా వారు వెనక్కి తగ్గలేదు. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు వెంకయ్య ప్రకటించారు.