తెలంగాణలో కారు జోరు చూపిస్తుంది. స్పష్టమైన మెజారిటీ దిశగా కారు దూసుకుపోతుంది. 119 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోప్పటివరకూ అందిన సమాచారం మేరకు టీఆర్ఎస్ 84 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా కూటమి 22 స్థానాల్లో, బీజేపీ 5 స్థానాల్లో, ఇతరులు 4 స్థానాల్లో ముందున్నారు. మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు కాగా, ఇప్పటికే టీఆర్ఎస్ అదనంగా మరో 24 చోట్ల మెజారిటీ చూపుతుండటం గమనార్హం. యాకత్ పురాలో అనూహ్యంగా ఎంఐఎం వెనుకబడగా, బీజేపీ ముందంజలో నిలిచింది. టీఆర్ఎస్ ముఖ్య నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు దూసుకుపోతుండగా అందరూ ఆసక్తిగా గమనించిన కూకట్ పల్లిలో కూటమి అభ్యర్ధి సుహాసిని (టీడీపీ) వెనుకబడ్డారు. అక్కడ తెరాస అభ్యర్థి మాధవరం కృష్ణారావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కూటమికి చెందిన కాంగ్రెస్ ముఖ్యనేతలు జానారెడ్డి, రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ తదితరులు తెరాస అభ్యర్థులపై వెనుకంజలో ఉన్నారు.