Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు వారి ఆరాధ్య నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రంకు అనూహ్య స్పందన దక్కింది. చిత్ర యూనిట్ సభ్యులు సైతం తమ సినిమాను ఇంతగా ఆధరిస్తారని భావించలేదని, ఈ ఆధరణ చూస్తుంటే దాదాపు రెండు సంవత్సరాలు పడ్డ కష్టం అంతా కూడా మర్చి పోయాం అంటూ దర్శకుడు నాగ్ అశ్విన్ అంటున్నాడు. సినిమాకు మంచి పేరు రావడంతో పాటు నిర్మాతలకు మంచి కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఈ సినిమాకు అన్ని వైపుల నుండి 40 కోట్లు వస్తే చాలని నిర్మాతలు భావించారు. కాని ఇప్పుడు కేవలం థియేటర్ల కలెక్షన్స్ రూపంలోనే 50 కోట్లకు పైగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అన్ని వైపుల నుండి అంటే అన్ని రైట్స్ ద్వారా సునాయాసంగా వంద కోట్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
‘మహానటి’కి ముందు విడుదలైన ‘రంగస్థలం’ చిత్రం జోరు తగ్గింది. ఆ తర్వాత వచ్చిన ‘భరత్ అనే నేను’ మెల్ల మెల్లగా ఫేడ్ అవుట్ అవుతున్నాడు. ఇక నా పేరు సూర్య చిత్రం అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఇక మహానటి తర్వాత వచ్చిన మెహబూబా మెప్పించడంలో విఫలం అయ్యింది. ఇక రెండు వారాల వరకు పెద్ద సినిమాలు లైన్లో లేవు. ఆ కారణంగానే ‘మహానటి’ చిత్రం భారీ వసూళ్లను సాధించడం ఖాయం అనిపిస్తుంది. ప్రస్తుతం సినిమాకు అన్ని ఏరియాల నుండి హౌస్ఫుల్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే నిర్మాతలు పెట్టిన పెట్టుబడి రికవరీ అయినట్లుగా సమాచారం అందుతుంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అద్బుతమైన నటనతో ఆకట్టుకుంది. అచ్చు సావిత్రిలా కనిపించి ప్రేక్షకుల కళ్లను మోసం చేసిందని, నిజంగానే సావిత్రి అన్నట్లుగా కనిపించిందని విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినీ వర్గాల వారు కూడా మహానటిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి సమయంలో మహానటి జోరుకు ఇప్పట్లో బ్రేక్ వేసే దమ్ము ఎవరికి లేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.