Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాలీవుడ్ లానే టాలీవుడ్ కూడా బయోపిక్ ల బాటపట్టింది. ఇప్పటికే నందమూరి తారక రామారావు, మహానటి సావిత్రి జీవితాలు తెరకెక్కుతుండగా… తాజాగా మరో బయోపిక్ పట్టాలెక్కుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాన్ని తెరకెక్కించేందుకు దర్శకుడు మహి వి. రాఘవ్ సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆనందో బ్రహ్మ డైరెక్టర్ అయిన మహి… వైఎస్ బయోపిక్ కోసం ఆయన కుమారుడు వైఎస్ జగన్ అనుమతి కూడా తీసుకున్నారు. వైఎస్ పాత్రను ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి పోషించనున్నట్టు సమాచారం. బయోపిక్ కు సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే దర్శకుడు ప్రకటించనున్నాడు. వైఎస్ పై సినిమా తీసే ప్రయత్నాలు జరగడం ఇదే మొదటిసారి కాదు.
2009లో హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ చనిపోయిన కొన్నిరోజులకే ఆయనపై సినిమా తీయనున్నట్టు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రకటించారు. సినిమాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. కానీ ఏ కారణాల వల్లో ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ఇన్నేళ్లుగా వైఎస్ పై సినిమా తీసేందుకు మళ్లీ ఎవరూ ఆసక్తి చూపలేదు కానీ… మహానటితో టాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ మొదలవడంతో వైఎస్ జీవితాన్ని కూడా తెరకెక్కించే ప్రయత్రం ప్రారంభమయింది. వైఎస్ జీవితకథ అంటే అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆసక్తికరమైనదే. కుటుంబ రాజకీయ, ఫ్యాక్షన్ నేపథ్యం, వైఎస్… రాజకీయరంగ ప్రవేశం, సుదీర్ఘ రాజకీయ పయనం, ప్రజాప్రస్థానం, 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కావడం, 2009లో రెండోసారి గెలుపొందిన కొన్ని నెలలకే దుర్మరణం పాలవడం… వంటి ఘటనలన్నింటినీ సినిమాలో చూపించడం ద్వారా సమకాలీన రాజకీయ పరిస్థితులను కళ్లకు కట్టినట్టు అవుతుంది. ఇక ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఇట్టే ఒదిగిపోయే మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి క్యారెక్టర్ పోషించనుండడం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ.