Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సినీ నటి మంచు లక్ష్మి ఓ సామాజిక సమస్యపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. వినాయక మండపాలు, ఎత్తయిన విగ్రహాల మూలంగా హైదరాబాద్ కు కలుగుతున్ననష్టం, ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఆమె స్పందించారు. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేస్తున్న వినాయక విగ్రహాల వల్ల నగరానికి కలుగుతున్న నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని మంచు లక్ష్మి మంత్రిని ట్విట్టర్ ద్వారా రాసిన లేఖలో ప్రశ్నించారు. వినాయక మండపాలను నిర్మించటానికి రోడ్లను తవ్వుతున్నారని, పెద్ద విగ్రహాల ఏర్పాటు కోసం కేబుల్ వైర్లు కూడా తెంచివేస్తున్నారని, పండుగ ముగిసిన తర్వాత కూడా వాటిని అలానే వదిలిస్తున్నారని లక్ష్మి ఫిర్యాదుచేశారు.
భారీ విగ్రహాలు….స్వాగత తోరణాలతో ట్రాఫిక్ కు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోందన్నారు. వినాయక చవితిని మతపరమైన పండుగలా భావించటం లేదని, ఓ పోటీలా అనుకుంటున్నారని..వేడుకను ఇతరుల కన్నా వైభవంగా, గొప్పగా జరపాలని తాపత్రయపడుతున్నారని లక్ష్మి అన్నారు. దీన్ని అరికట్టేందుకు ఓ ప్రాంతానికి ఒకే మండపం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనివల్ల ప్రజల్లో ఐక్యత పెరగడమే కాకుండా కలిసి పండుగను జరుపుకుని సంప్రదాయాన్ని కాపాడాలనే ఆలోచన వస్తుందని సూచించారు. అనేక ప్రాంతాల్లో ప్రజలు వినాయక చవితి సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారంతా తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారనే ఉద్దేశంతోనే సామాజిక మాధ్యమం ద్వారా తాను ఈ లేఖ రాస్తున్నానని లక్ష్మి చెప్పారు. అభివృద్ధి చెందుతున్న నగరంగా ముందంజలో ఉన్న హైదరాబాద్ కు నష్టం కలగటం తనను చాలా బాధించిందని తెలిపారు. మహానగరంలో మట్టి విగ్రహాలకు ఆదరణ పెరగటం ఆనందంగా ఉందన్నారు. లేఖతో పాటు మంచు లక్ష్మి ఫిలింనగర్ లో గణపతి వేడుక కోసం రోడ్డును తవ్వి, కట్టెలు కడుతున్న ఫొటోను పోస్ట్ చేశారను.
మరిన్ని వార్తలు: