Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయాల్లో స్వామీజీల పాత్ర మన దేశంలో సర్వసహజ అంశం అయిపోయింది. కొన్ని విషయాలు వింటే బాబాలు, స్వామీజీలు ఈ స్థాయిలో రాజకీయ నిర్ణయాల్ని ప్రభావితం చేస్తారా అని ఆశ్చర్యం వేస్తుంది. 2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో వైసీపీ కి మంచి ఫలితాలు వచ్చాయి. ఆ తరువాత టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ తో సీన్ మారిపోయింది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో పార్టీ బలం తగ్గిపోయింది. దీంతో జిల్లాలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా కందుకూరు నియోజకవర్గంలో పార్టీకి బలమైన నేత కోసం ఎదురు చూస్తోంది. మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి ని పార్టీ లోకి ఆహ్వానించింది. ఆయన కూడా అందుకు ఆసక్తి చూపించారు. అయినా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. పైగా వైసీపీ నాయకత్వంతో మాట మాత్రం అయినా చెప్పకుండా మహీధర్ రెడ్డి టీడీపీ లో చేరడానికి తనంతట తానుగా ప్రయత్నం చేయడం మొదలెట్టారు. కారణం ఏంటా అని ఆరా తీస్తే ఆసక్తికర అంశాలు బయటికి వచ్చాయి.
కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ టికెట్ కోసం ఇప్పటికే దివి శివరాం, పోతుల రామారావు పోటీ పడుతున్నారు. ఇక మహీధర్ రెడ్డి కూడా టీడీపీలోకి చేరితే ముగ్గురు ఆ టికెట్ ఆశించినట్టు అవుతుంది. ఎవరికీ అక్కడ టికెట్ గారంటీ లేదు. కానీ వైసీపీ లో చేరితే అలా కాదు. తేలిగ్గా టికెట్ దొరుకుతుంది. ఇక రాజకీయంగా చూసుకున్నా గడిచిన మూడు ఎన్నికల్లో అక్కడ టీడీపీ గెలవలేదు. అయినా వైసీపీ ఆహ్వానాన్ని కాదని మహీధర్ రెడ్డి టీడీపీ వైపు చూడడానికి ఓ బాబా కారణం అంటే నమ్మగలరా ?. కానీ ఇది నిజంగా నిజం.
మానుగుంట మహీధర్ రెడ్డి రామ్ రతన్ బాబా సలహాలు, సూచనలు పాటిస్తారు. ఎప్పటిలాగానే వైసీపీ లో చేరదామన్న నిర్ణయం గురించి కూడా ఆయన సదరు బాబాతో చెప్పుకున్నారు. కానీ ఆయన వైసీపీ లో నీకు రాజకీయంగా భవిష్యత్ బాగుండదని, అదే టీడీపీ లో అయితే ఉజ్వలంగా ఉంటుందని చెప్పారట. అందుకే ఇప్పటికే టికెట్ కోసం ఇద్దరు నాయకులు పోటీ పడుతున్న టీడీపీ లోకి వెళ్ళడానికే మొగ్గుజూపుతున్నారు. టికెట్ లొల్లి చూసి ఇంకో నాయకుడిని పార్టీలోకి తీసుకోడానికి టీడీపీ లోకి తీసుకోడానికి హైకమాండ్ సైతం పెద్దగా ఇంటరెస్ట్ చూపడం లేదు. అయినా బాబా మాట నమ్మి టీడీపీ వైపే చూస్తున్నారు మానుగుంట. మాములుగా అయితే ఏదో ఒక ఆశ చూపి మానుగుంటని పార్టీలోకి తీసుకోవచ్చని వైసీపీ అనుకుంది. అయితే ఇప్పుడు బాబా మాటకి కట్టుబడి మానుగుంట నో అంటుంటే ఆయన్ని ఒప్పించడం ఎలాగో వైసీపీ కి అర్ధం కావడం లేదట. మొత్తానికి రాజకీయాలతో ఏ సంబంధం లేని బాబా కూడా ఆలా వైసీపీ కి దెబ్బేసాడు.