భూమా వారింట పెళ్లి సందడి మొదలైంది. ఏపీ పర్యాటక శాఖ మంత్రి అఖిల ప్రియ పెళ్లి కూతురయ్యారు. మంత్రి నారాయణ సమీప బంధువు అల్లుడు వరసయ్యే భార్గవ్ రామ్‌ను అఖిల ద్వితీయ పెళ్లి చేసుకోబోతున్నారు. కర్నూలు జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా ఈ వివాహ వేడుకను జరిపేందుకు భూమా కుటుంబం ఏర్పాట్లు చేసింది.
వివాహ వేడుకకు ఆళ్లగడ్డలోని శోభానాగిరెడ్డి ఇంజనీరింగ్ మెమోరియల్ కళాశాల ప్రాంగణం సిద్ధమైంది. వైభవంగా జరగనున్న ఈ వివాహానికి అతిరథ మహారథులు హాజరు కానున్నారు. మంత్రి అఖిల ప్రియ వివాహానికి దాదాపు 40 వేల వివాహ ఆహ్వాన పత్రికలను అంటే లారీడు పత్రికలను అందజేశారు.
తెలుగు రాష్ట్రల గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబులతో పాటుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, పలువురు సినీనటులు, హీరోలు హాజరు కానున్నారు. పెళ్లిలో రాయలసీమ రుచులతో పాటు, ఆయా జిల్లాల ప్రత్యేక వంటకాలను అతిథులకు విందుగా పెట్టనున్నారు.
భూమా అఖిలప్రియ మేనమామ ఎస్వీ మోహన్ రెడ్డి, అన్న భూమా బ్రహ్మానంద రెడ్డి పెళ్లి వేడుకలను దగ్గరుండి చూసుకుంటున్నారు. పెళ్లి మాత్రం బుధవారం ఉదయం 10.57 గంటలకు అంటే రేపు ఉదయం జరగనుంది. ఇందుకోసం ఆళ్లగడ్డలో భారీ ఏర్పాట్లు చేశారు.