Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ లో అధికార పగ్గాలు చేపట్టడానికి సంఖ్యాపరంగా ఎక్కువమంది ఉన్న కాపులు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం విఫలం అయ్యాక ఆ వర్గంలో కాస్త నిరాశ అలుముకుంది. అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ జనసేన పెట్టడం, ఆయన మద్దతుతో టీడీపీ అధికారంలోకి రావడంతో కొత్త జోష్ వచ్చింది. కాపులు మొత్తంగా జనసేన వెంట వెళితే జరిగే ప్రమాదాన్ని రుచి చూసిన వైసీపీ అధినేత జగన్ తెలివిగా రిజర్వేషన్ అంశంతో ముద్రగడను ముందుంచి కాపు ఓట్ల లో చీలిక కోసం ప్రయత్నించారు. అయితే చంద్రబాబు దగ్గర ఈ పప్పులు పెద్దగా ఉడకలేదు. ఇప్పటికీ కాపులు పవన్ వెంట నడవడానికి సిద్ధంగా వున్నారు.
అయితే కాపు రిజర్వేషన్ అంశంతో మళ్లీ వెలుగులోకి వచ్చిన ముద్రగడ మీద పార్టీల దృష్టి పడింది. ముద్రగడని, మాజీ ఎంపీ , ఎస్సీ నేత హర్ష కుమార్ ని తమ పార్టీలో చేరమని ఇప్పటికే కాంగ్రెస్ ఆహ్వానాలు పంపుతోంది. అటు వైసీపీ కూడా వారి మీద కన్నేసింది. గత అనుభవాల దృష్టితో ఈ ఇద్దరూ త్వరత్వరగా నిర్ణయం తీసుకోడానికి సిద్ధంగా లేరు. ఏదో ఒక పార్టీలో చేరి టికెట్ కోసమో, పదవుల కోసమో సాగిలపడే బదులు తామే ఓ శక్తిగా అవతరించాలని చూస్తున్నారు. దీనికి సన్నాహకంగా ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడిలో అంబేద్కర్ విగ్రహ ప్రారంభ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించారు. కాపులు, దళితులు కాంబినేషన్ తో అధికారం దక్కించుకోవచ్చు అన్న దిశగా అక్కడికి వచ్చిన వారి ఆలోచనలు సాగాయి. సంఖ్యాపరంగా చూస్తే ఇది డెడ్లీ కాంబినేషన్. కానీ ఈ కాంబినేషన్ ని ఆ స్థాయికి తీసుకెళ్లే శక్తి మాత్రం ఈ ఇద్దరికీ లేదు. అందుకే గోదావరి జిల్లాల్లో తమ వాదం బలం పుంజుకునేలా చేసి ఆపై వైసీపీ తో పొత్తు కి వెళ్లి పవన్ కి అండగా ఉంటున్న కాపుల్లో చీలిక తేవాలన్న మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టు అర్ధం అవుతోంది. ఈ పరోక్ష ప్రత్యర్థులను పవన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.