యంగ్ హీరో నాని మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నాగార్జునతో కలిసి ఒక మల్టీస్టారర్ చిత్రాన్ని చేస్తున్న నాని మరో వైపు బిగ్‌బాస్ సీజన్ 2కు హోస్టింగ్ చేస్తున్నాడు. ఇంకా పలు చిత్రాలతో నాని బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ సమయంలోనే టైగర్ నాగేశ్వరరావు పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొన్నాళ్ల క్రితం తెలుగు రాష్ట్రం పోలీసులకు నిద్ర పట్టకుండా చేసిన ఒక దొంగ కథతో సినిమాకు స్క్రిప్ట్ రెడీ అవుతుంది. దొంగ నాగేశ్వరరావుకు టైగర్ నాగేశ్వరరావు అనే పేరు కూడా ఉంది. అప్పట్లో సంచలనం సృష్టించిన దొంగ నాగేశ్వరరావు జీవిత చరిత్రకు అనీల్ సుంకర దాదాపు రెండు సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన చేస్తున్న ప్రయత్నాలు అంతగా మెప్పించలేక పోతున్నాయి.
మొన్నటి వరకు టైగర్ నాగేశ్వరరావు సినిమాను రానాతో చేయాలని నిర్మాత అనీల్ సుంకర భావించాడు. కాని ఆయనకు రానా సహకరించడం లేదు. దాంతో రానా స్థానంలో నానిని తీసుకు వచ్చేందుకు అనీల్ ప్రయత్నం చేసి సఫలం అయ్యాడు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ చిత్రంకు దర్శకత్వం ఎవరు వహిస్తారు అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. నాని వరుసగా చిత్రాలు చేస్తు ఈ చిత్రానికి కమిట్ అవ్వడం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇప్పటి వరకు క్లాస్‌గా, మంచి కుర్రాడిగా నటించిన నాని మొదటి సారి పూర్తి మాస్‌గా, దొంగ కుర్రాడిగా కనిపించబోతున్నాడు. నాని కెరీర్లో విభిన్నమైన సినిమాగా ఈ చిత్రం ఉంటుందని అప్పుడే టాక్ వినిపిస్తుంది. తన ప్రతి సినిమాలో కూడా విభిన్నంగా కనిపించానే ఉద్దేశ్యంతో నాని కొత్త పాత్రలు ఎంపిక చేసుకుంటూ ఉంటాడు. అలాగే ఈ చిత్రంతో కూడా నాని కొత్తగా కనిపించబోతున్నాడు.