నటీనటులు: సుధీర్ బాబు, నభా నటేష్
దర్శకుడు: ఆర్.ఎస్.నాయుడు
సంగీతం: బి.అజనీష్ లోకనాథ్
సినిమాటోగ్రఫీ: సురేష్ రగుటు
ఆర్ట్ డైరెక్టర్: శ్రీకాంత్ రామిశెట్టి
ఎడిటర్: చోట కె ప్రసాద్
నిర్మాత: సుధీర్ బాబు
బ్యానర్: సుధీర్ బాబు ప్రొడక్షన్స్
నన్ను దోచుకుందువటే… సుధీర్ బాబు ద్విపాత్రాభినయం చేసిన సినిమా… సినిమాలో కాదండోయ్… ఒకటి తెర మీద, మరొకటి తెర వెనుక… అంటే, మొదటి సారి తను ఒక సినిమాకి నిర్మాతగా వ్యవహరించడం, అందులోనూ అది ఆయనే హీరోగా నటించిన సినిమా కావడం ఇంకా విశేషం. కాబట్టి, దీన్ని ఆయన చాలా ఎక్కువగానే పట్టించుకున్నరన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే, సినిమా ప్రచారం ఏ స్థాయిలో చేసారో మనందరం చూసాం. కామెడీ వీడియోలు అని, చాలెంజ్ లు అని చాలనే చేశారు, మనం చూసాము. అయితే, కన్నడ నటి అయిన నభా నటేష్, దర్శకుడు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా చేసిన ఆర్.ఎస్.నాయుడు దర్శకుడిగా, సుధీర్ బాబు నిర్మాతగా మొదటి సినిమా ఇదే కావడం విశేషం.. కాగా, మరి ఇప్పుడు బొమ్మ తెర మీదకి వచ్చేసింది… ఒకసారి దాని గురించి కాసేపు మాట్లాడుకుందాం…
కథ:
కార్తీక్ (సుధీర్ బాబు) చాలా ఫోకస్ ఉన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఎప్పటినుండో అమెరికా వెళ్ళాలన్న కలలుగనే వ్యక్తి. అంతకుమించీ, సీరియస్ ఫేస్ వేసుకుని తిరిగే చిరాకైన బాస్. ఇతను సంగతి ఇలా ఉంటే, మేఘన (నభా నటేష్) చురుకైన, సరదాగా ఉండే అమ్మాయి. అనుకోకుండా ఒకరి జీవితంలోకి మరొకరు వస్తారు. అయితే, కొన్ని విపరీత కారణాల వల్ల కార్తీక్ మేఘనానే తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్తాడు. ఇక తరువాత, ఇద్దరూ కూడా కలసి ఉన్న కొన్ని రోజుల తరువాత, కార్తీక్ కి తన భవిష్యత్తు మీద భయం వేసి తనను దూరం పెడతాడు కానీ తనను ఇంకా ప్రేమిస్తూనే ఉంటాడు. చివరికి, తను అమెరికాకి వెళ్తాడా, లేక మేఘనకి తన ప్రేమ విషయం చెప్తాడా, అసలు అతనికి ఉన్న సమస్య ఏంటి అన్నదే తదుపరి కథ. అదే ఈ నన్ను దోచుకుందువటే….
విశ్లేషణ:
కొత్త దర్శకుడు అయిన ఆర్.ఎస్.నాయుడు కథను అందంగానే చెప్పారు. కథ పాయింట్ మామూలుదే అయినా కూడా దానిని ఒక కొత్త విధానం లో ప్రెజెంట్ చేశారు. సినిమా మొత్తం మీద ఎక్కడా కూడా బోర్ కొట్టించకుండా తీసుకువెళ్ళారు. నిజానికి, ఒక సినిమాకి, కథ, కథనం, నటన మేజర్ గా అవసరం. ఈ సినిమాలో, కథ, కథనం, రెండు బాగానే ఉన్నా కూడా మొదటి భాగం లో ఉన్న వినోదం ఏదయితే ఉందో అది రెండవ భాగానికి వచ్చేసరికి తగ్గిపోయింది. చెప్పాలంటే, అది కథకు తగ్గట్టుగా అది బాగానే ఉనా కూడా కొన్ని సాగదీసే సీన్స్ లేకుండా దీన్ని ఇంకొంచెం బాగా తీయవచ్చేమో అని అనిపించింది. కానీ, ప్రీ-క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ దర్శకుడు అధ్బుతంగా చూపించాడు.
సాధారణంగా అయితే, మన బయట జీవితాలు, వాటి తాలూకూ పరిస్థితులు తెర మీద కనిపించడం చాలా తక్కువే. కానీ, కొన్ని సినిమాలు మాత్రం ఆ విషయంలో మనకి నిజ జీవిత అనుభూతిని ఇస్తాయి. ఆ సినిమా జాబితాలో ఈ సినిమా కూడా నిలబడగలదని చెప్పొచ్చు. ఎందుకంటే, పూర్తిగా కాకపోయినా, కొంతవరకయినా దర్శకుడు నాచురల్ గా చూపించడానికి ప్రయత్నించాడని తెలుస్తుంది. ఇక సినిమాలోని కొన్ని సన్నివేశాలు చాలా నవ్విస్తాయ్, ముఖ్యంగా వైవా హర్ష ఎపిసోడ్స్. ట్రైలర్ లో మనం ఏదయితే షార్ట్ ఫిల్మ్ సీన్ చూసామో అది చాలా బావుంది. ఇంతకు ముందు చెప్పినట్టు ఇలాంటి సీన్స్ అన్నీ కూడా మనం నాచురల్ గా ఫీల్ అయ్యేలా చేస్తాయ్.
నటన:
ఇక నటనకి వస్తే, సుధీర్ బాబు చాలా బాగా చేశారు. కామెడీ సీన్స్ గాని, ఎమోషనల్ సీన్స్ గానీ బాగా చేశారు. అలాగే, కన్నడ నుండి తెలుగు తెరకు వచ్చిన నభా నటేష్ చాలా అంటే చాలా బాగా నటించింది. వీలయినంత వరకు, ఈ సినిమాకు గానూ తను చాలా మంది ప్రశంసలు అందుకుంటుంది అనడంలో అతిశయోక్తే లేదు. ఇక వైవా హర్ష కామెడీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే, నాజర్, తులసి ఎప్పటి లాగానే వాళ్ళ అనుభవాన్ని చూపించారు. మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగానే నటించారు.
సాంకేతిక వర్గం:
సినిమా సాంకేతికంగా చాలా బావుంది. ముఖ్యంగా, నిర్మాతగా సుధీర్ బాబు తొలి సినిమా అయినా నిర్మాణ విలువలు బావున్నాయి. దర్శకుడు వినోదభరితంగా సినిమాను నడిపినా కథనంలో కొన్ని మేళవింపులు కావాలి. కానీ, చేసిన వరకు తన ప్రతిభ ఘనంగా కనిపిస్తుంది, చాలా బాగా కొన్ని సీన్స్ ని నడిపించాడు. పాటలు పర్లేదు, అయితే సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది.మొత్తంగా నన్ను దోచుకుందువటే అన్ని ఎమోషన్స్ ని కలగలిపిన సినిమా. సరదాగా వీకెండ్ ఎంజాయ్ చేయడానికి సరైన సినిమా అని మాత్రం చెప్పగలం.
తెలుగు బుల్లెట్ పంచ్ లైన్: నన్ను దోచుకుందువటే… బాగానే దోచుకుంటుంది….
తెలుగు బుల్లెట్ రేటింగ్: 2.75/5