Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నటీనటులు: రవితేజ, మాళవికా శర్మ, జగపతిబాబు, పోసాని కృష్ణమురళి, అలీ
మ్యూజిక్ : శక్తికాంత్ కార్తీక్
సినిమాటోగ్రఫి : ముఖేష్.జి
నిర్మాత: రామ్ తాళ్లూరి
దర్శకత్వం: కల్యాణ్ కృష్ణ కురసాల
సాధారణంగా మాస్ మహారాజా రవితేజ సినిమా వస్తుందంటే అన్ని వర్గాల వారు ఆ సినిమా కెళ్ళడానికి ఆసక్తి కనబరుస్తారు. ఈ మధ్య కాలంలో దాదాపు రెండేళ్లు సినిమాలు చేయకుండా గ్యాప్ తీసుకున్న రవితేజ రాజా ది గ్రేట్ నుండి స్పీడు పెంచేశారు. టచ్ చేసి చూడు తరువాత ఇప్పుడు రవితేజ చేసిన మరో కమర్షియల్ ఎంటర్టైనర్ నేలటిక్కెట్టు. టైటిల్ వినడానికి మాస్ ఆడియెన్స్‌కు కోసమే అన్నట్టు ఉన్నా సినిమా మాత్రము అటు బాల్కనీ నుండి నేల క్లాసు వరకు అందరిని ఆకట్టుకుంటుందని దర్శక నిర్మాతలు చెబుతూ రావడంతో సినిమా మీద సాధారణంగానే ఆసక్తి పెరిగింది. తీసింది రెండు సినిమాలే అయినా మర్చిపోలేని విజయాల్ని ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం మరింత అంచనాల్ని పెంచేసింది.
చుట్టూ జనం మధ్యలో మనం అనే కాన్సెప్ట్ చుట్టూ దర్శకుడు అల్లుకున్న కధే ఈ నెల టికెట్టు. రవితేజ అనాథ. హైదరాబాద్‌లో తన స్నేహితులతో కలిసి ఉంటాడు. చిన్ననాటి నుండి అనాథగా పెరగడంతో ప్రతి ఒక్కరినీ ఏదో ఒక వరుస పెట్టి పిలుచుకుంటూ ఉంటాడు. ఆనంద్ భూపతి అనబడే శరత్‌బాబు మంచి వ్యక్తి. అతని జీవితాశయం అనాథల కోసం ఆనంద నిలయంను నిర్మించడం అయితే ఆయన తన కొడుకు అజయ్ భూపతి (జగపతిబాబు)ని మంత్రిగా చూడాలనుకుంటాడు. ఆనంద్ భూపతి కొడుకు కావడంతో అజయ్ ఎలక్షన్స్‌లో గెలిచి… మంత్రి అవుతాడు. ఓరోజు అజయ్ భూపతి కారుపై టెర్రరిస్ట్ ఏటాక్ జరుగుతుంది.
ఆ ఏటాక్లో అజయ్ భూపతి తప్పించుకుంటాడు. కానీ ఆనంద భూపతి చనిపోతాడు. ఆనంద భూపతి టెర్రరిస్ట్ ఏటాక్ వల్ల చనిపోలేదని… ప్లానింగ్ ప్రకారం జరిగిన మర్డర్ అని తెలుస్తుంది. అయితే రౌడీలు అనాథాశ్రమాల మీద కన్ను వేయడం, దానికి సంబంధించిన డబ్బును చేజిక్కించుకోవడం, స్థలాలను కబ్జాచేయడం… వారి బారి నుంచి హీరో వాటిని కాపాడటం అనే కాన్సెప్టుతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఇక్కడ దర్శకుడు రాసుకున్న లైన్ మాత్రం అదుర్స్ అదేంటంటే రొటీన్ కి భిన్నంగా అనాథాశ్రమంలో పెరిగి పెద్దవాడయిన వ్యక్తే ఆ అనాధాశ్రమాన్ని చేజిక్కించుకోడానికి చూస్తాడు.
దర్శకుడు రాసుకున్న కధ చాలా బాగుంది కానీ సన్నివేశాలు మాత్రం తేలిపోయినట్లు అనిపిస్తాయి. ఒక్కో ఫ్రేమ్ నిండా మనుషులు వారెందుకు వస్తున్నారో ఎందుకు వేలుతున్నారో అర్ధంకాక బుర్ర పట్టుకోవడం గ్యారెంటీ. చాలా పాత్రలు ఎందుకు వస్తాయో, ఎందుకు పోతాయో తెలియదు. కళ్యాన్ కృష్ణ రాసిన డైలాగులు అక్కడక్కడా మాస్‌ను ఆకట్టుకుంటాయి. హీరోయిన్ ఓకే అనిపించినా గానీ, ఇంకా బాగా చెయ్యచ్చు అనిపించింది. దాదాపు అందరు కమెడియన్లను సినిమాలో వాడినా కామెడీ పండలేదు. కొన్ని కొన్ని సన్నివేశాలు కూడా లాజిక్ లేనివిగా అనిపిస్తాయి. ఆడియో బాగున్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో దెబ్బ పడింది. అయితే కేవలం రవితేజ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని థియేటర్ కి వెళ్లకపోవడం మంచింది. ఉన్నంతలో కమెడియన్లను బాగా వాడుంటే బాగుండేది.