Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమెరికా భూభాగం గువామ్ పై దాడిచేస్తామంటూ పదే పదే హెచ్చరికలు చేసి చైనా జోక్యంతో వెనక్కి తగ్గిన ఉత్తరకొరియా… మళ్లీ అణ్వస్త్ర దాడి బెదిరింపులకు దిగుతోంది. గువామ్ పై దాడి చేస్తే ఇలా ఉంటుందంటూ గతంలో పోస్టర్లు విడుదలచేసిన ఉత్తర కొరియా ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి యానిమేటెడ్ వీడియో విడుదల చేసి అమెరికాను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. గువామ్ దాడిచేస్తే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టుగా చూపించింది ఆ వీడియో. అమెరికాను తీవ్రమైన పదజాలంతో ఉత్తరకొరియా దూషించిన ఆ వీడియో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది.
ఒక్కదెబ్బతో అమెరికా పొగరు అణుగుతుందని, ప్రపంచంలో తామే అధికులమని అమెరికా మూర్ఖులు ఊహల్లో తేలియాడుతున్నారని ఉత్తరకొరియా మండిపడింది. తమ హవాంగ్ -14 న్యూక్లియర్ మిస్సైల్ అమెరికా పొగరు అణుచుతుందని హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమాధి శిలువలతో నిండిపోతుందని, పాపాత్ములైన అమెరికన్లకు నరకమే గతి అని తీవ్ర పదజాలాన్ని ప్రయోగించింది. అమెరికాతో తలపడేందుకు ఉత్తరకొరియా సర్వసన్నద్దంగా ఉందని ప్రకటించింది.
ఇప్పుడీ వీడియో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య ఎప్పుడేం జరుగుతుందో అని అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చల్లారిన తరువాత …అమెరికా రక్షణమంత్రి చేసిన వ్యాఖ్యలతో మళ్లీ నిప్పు రాజుకుంది. తాము దాడిచేస్తే ఉత్తరకొరియా నామరూపాలు లేకుండా నాశనమవుతుందని అమెరికా చేసిన వ్యాఖ్యలు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ కు ఆగ్రహం తెప్పించాయి. దానికి తోడు తమ శత్రు దేశం దక్షిణ కొరియా తో కలిసి అమెరికా మిలటరీ డ్రిల్ చేపట్టటం కిమ్ కు మరింత కోపం తెప్పించింది. దీంతో ఉత్తరకొరియా రోజూ అమెరికాకు వ్యతిరేకంగా హెచ్చరికలు జారీచేస్తోంది.
మరిన్ని వార్తలు: