జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థ అధినేత మసూద్ అజార్ పాకిస్థాన్ లోనే ఉన్నాడని ఆ దేశ విదేశాంగ మంత్రి షా మెహ్మూద్ ఖురేషీ ప్రకటించారు. సీఎన్ఎన్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన వద్ద ఉన్న సమాచారం ప్రకారం మసూద్ అజార్ పాకిస్థానీ జాతీయుడేనని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం బాలేదని ఇంటి నుంచి కూడా కదల్లేని పరిస్థితుల్లో ఉన్నాడని ఆయన తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైన అజార్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదనే ప్రశ్నకు సమాధానంగా ఉగ్రదాడికి పాల్పడినట్టు ఆధారాలను చూపెడితే, కోర్టు ముందు ఉంచి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఖురేషీ పేర్కొన్నారు. పాక్ లోని కొత్త ప్రభుత్వం కొత్త మైండ్ సెట్ తో పని చేస్తోందని శాంతిని కోరుకుంటోందని ఆయన తెలిపారు. దేశ ఆర్థి వ్యవస్థను బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్ లో గత 17 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధం కూడా అంతం కావాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు.