టైటిల్‌పై ఇంత సస్పెన్స్‌ ఏంటి పవన్‌..!

Pawan Kalyan fans are eagerly waiting for the release of PSPK25 title

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘కాటమరాయుడు’ చిత్రం నిరాశ పర్చడంతో పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ తర్వాత సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలున్న త్రివిక్రమ్‌ సినిమాలో ప్రస్తుతం పవన్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. రికార్డు స్థాయిలో ఈ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేయబోతున్నట్లుగా ముందు నుండే ఫ్యాన్స్‌ ఊహాగానాలు వినిపిస్తున్నారు. ఎప్పుడెప్పుడు పవన్‌, త్రివిక్రమ్‌ల మూవీ థియేటర్లలోకి వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే సినిమా వరుసగా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ప్రేక్షకులను ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూద్దామా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్‌ అసహనంకు లోనవుతున్నారు.

ముందుగా అనుకున్న ప్రకారం పవన్‌, త్రివిక్రమ్‌ల మూవీ విడుదల కావాల్సింది. కేవలం మూడు నెలల్లోనే పవన్‌తో మూవీని పూర్తి చేస్తానంటూ త్రివిక్రమ్‌ ఒకానొక సందర్బంలో చెప్పుకొచ్చాడు. కాని మూడు నెలలు కాదు కదా, సంవత్సరం కావస్తుంది. ఇంకా కూడా సినిమాను ముగింపు దశకు తీసుకు రావడంలో త్రివిక్రమ్‌ విఫలం అయ్యాడు. ఈ సినిమా టైటిల్‌ కూడా ఇంకా నిర్ణయించలేదు. దాదాపు పది టైటిల్స్‌ ప్రచారం జరుగుతున్నాయి. అందులో పవన్‌ కోసం ఏ టైటిల్‌ను ఖరారు చేస్తారు అనేది అందరిలో ఆసక్తిగా ఉంది. త్రివిక్రమ్‌ సినిమాలకు టైటిల్స్‌ విభిన్నంగా ఉంటాయి. టైటిల్స్‌లో క్రియేటివిటీని చూపించే దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ సినిమాకు ఎలాంటి టైటిల్‌ను పెట్టబోతున్నాడు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పటికే మూడు టైటిల్స్‌ను త్రివిక్రమ్‌ ఫైనల్‌ చేశాడని, అందులో ఒక టైటిల్‌ను పవన్‌ ఓకే చేయాల్సి ఉందట. ఆ మూడు టైటిల్స్‌లో ఒక టైటిల్‌ను ఓకే చేసేందుకు పవన్‌కు టైం లేదని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు. షూటింగ్‌ సమయంలో టైటిల్‌ గురించి మాట్లాడే అవకాశం లేదు, షూటింగ్‌ లేనప్పుడు పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలు, కుటుంబం అంటూ తిరుగుతున్నాడు. దాంతో త్రివిక్రమ్‌కు పవన్‌ సినిమా టైటిల్‌ను ఫైనల్‌ చేసే సమయం దొరకడం లేదు. ముందుగా అనుకున్న ప్రకారం దసరాకు టైటిల్‌ ప్రకటించాలి. కాని దసరా వెళ్లి పోయింది, దీపావళి వచ్చేస్తోంది. మరి ఇప్పుడైనా టైటిల్‌ను ప్రకటిస్తారేమో చూడాలి. ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా కీర్తి సురేష్‌ మరియు అను ఎమాన్యూల్‌లు నటిస్తున్న విషయం తెల్సిందే. త్రివిక్రమ్‌ సన్నిహితుడు రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.