పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ నిర్మాణ సంస్థ నవయగ మరో రికార్డు సృష్టించింది. 24 గంటల్లో 32,100 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు చేసి కొత్త గిన్నీస్ రికార్డును సృష్టించింది. 2017లో యూఏఈలో ఓ టవరు నిర్మాణంలో 24 గంటల్లో 21,580 ఘనపు మీటర్ల కాంక్రీటు వేశారు. ఇప్పటి వరకూ అదే రికార్డుగా ఉండేది. ఇప్పుడు పోలవరంలో.. ఈ రికార్డును 16 గంటల్లోనే అధిగమించారు. పోలవరం ప్రాజెక్ట్ ఈ రికార్డును సాధించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తంచేశారు. నవయుగ సంస్థ ఎండీ శ్రీధర్‌కు ఆదివారం రాత్రి ఫోన్ చేసి అభినందించారు. పోలవరం పనుల్లో పాల్గొన్నవారంతా చరిత్రలో నిలిచిపోతారని ప్రశంసించారు. నేడు పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించి గిన్నిస్ బుక్ ప్రతినిధుల చేతుల మీదుగా అధికారికంగా గిన్నిస్ రికార్డు పత్రాలను అందుకోనున్నారు.
వాస్తవానికి పోలవరంలో రికార్డు కాంక్రీటు పనులు డిసెంబరు 17నే చేపట్టాలని నవయుగ నిర్మాణ సంస్థ అన్ని ఏర్పాట్లు చేసుకున్నా పెథాయ్ తుపాను కారణంగా దీన్ని వాయిదా వేశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్ట్స్ అధికారులు ఆదివారం స్లాట్ ఇవ్వడంతో నవయుగ సంస్థ, ప్రాజెక్టు అధికారులు అదనపు కాంక్రీటు పనులకు ఏర్పాట్లు చేశారు. ముందుగా ప్రకటించినట్లు ఆదివారం ఉదయం 8 గంటలకే పనులను ప్రారంభించారు. మొదటి గంట కాస్త తక్కువగా వేసినా తర్వాత నుంచి వేగం అందుకొని 1300 క్యూబిక్ మీటర్ల పైబడి కాంక్రీటు వేశారు. అత్యంత వేగంతో పని చేస్తున్నందున నాణ్యత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ రికార్డు సాధనకు 3,600 మంది కార్మికులు, 500 మంది సాంకేతిక సిబ్బంది పనిచేశారు. 2 లక్షల బస్తాల సిమెంటు, 40 క్యూబిక్ మీటర్ల మెటల్, 2 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక, కాంక్రీటులో కలపడానికి 200 టన్నుల యార్డ్ మిక్చరు ఉపయోగించారు. కాంక్రీటును స్పిల్ చానల్‌కు తరలించడానికి 70 ట్రాన్సిక్ మిల్లర్లు, 20 ఎడిటర్లు, 20 డంపర్లు, 5 టెలిబెల్టులు ఉపయోగించారు. ఈ మొత్తం పనుల ప్రక్రియను గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఎప్పటికప్పుడు నమోదు చేసుకున్నారు.
ఈ పనులను డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ ఛైర్మన్ ఏబీ పాండ్య పరిశీలించారు. ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా నవయుగ నిర్మాణ సంస్థ ఎండీ కె.శ్రీధర్ ఎప్పటికప్పుడు సిబ్బందితో సమీక్షించారు. గిన్నిస్ బుక్ రికార్డ్సుకు సంబంధించి 24 మంది ఇంజినీర్లతో కూడిన బృందం పనులను పరిశీలించింది. ఏపీ జలవనరుల మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు సైతం అదివారం రాత్రి పోలవరంలో బసచేసి కాంక్రీటు పనులను పర్యవేక్షించారు.