Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేంద్రప్రభుత్వంపై విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు కొనసాగుతున్నాయి. ఇటీవలి కాలంలో తరచూ బీజేపీపై విమర్శలు చేస్తున్న ప్రకాశ్ రాజ్ తాజాగా కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ వ్యాఖ్యలపై తన దైన శైలిలో స్పందించారు. రెండు రోజుల క్రితం సత్యపాల్ సింగ్… డార్విన్ జీవపరిణామ క్రమ సిద్ధాంతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. డార్విన్ సిద్ధాంతం తప్పని…మన పురాణాల్లో ఎక్కడా ఆ సిద్ధాంతం లేదని విచిత్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా డార్విన్ సిద్ధాంతాన్ని స్కూళ్లు, కాలేజీల్లో బోధించకూడదని కూడా ఆయనన్నారు. సత్యపాల్ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి వ్యాఖ్యలకు కౌంటర్ గా ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేశారు.
మనిషి కోతి నుంచి పుట్టాడన్న విషయాన్ని మన పూర్వీకులు చూడలేదని మంత్రిగారు అంటున్నారు. అయితే ప్రియమైన మంత్రిగారూ….ఇప్పుడు మళ్లీ కొన్ని భిన్నమైన పరిస్థితులను మాత్రం మనం చూస్తున్న విషయాన్ని మీరు అంగీకరించకుండా ఉండగలరా…? డార్విన్ సిద్ధాంతానికి రివర్స్ లో ఇప్పుడు జరుగుతోంది. అంటే మానవుడు కోతిలాగా మారి గతాన్ని తవ్వుతూ మళ్లీ రాతి యుగం నాటికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. అని ప్రకాశ్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొన్నిరోజులుగా ప్రకాశ్ రాజ్ కు, బీజేపీకి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. బెంగళూరులో దారుణ హత్యకు గురయిన గౌరీలంకేశ్ ప్రకాశ్ రాజ్ కుటుంబ స్నేహితురాలు కావడంతో ఆ హత్య కేసులో తొలిసారి ప్రధాని తీరుపై ప్రకాశ్ రాజ్ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తంచేశారు. అప్పటినుంచి కేంద్రంపై ఆయన మాటల యుద్ధం కొనసాగుతోంది. అదే సమయంలో ప్రకాశ్ రాజ్ వైఖరిపై బీజేపీ కూడా తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇటీవల కర్నాటకలోని సిర్సిలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకాశ్ రాజ్ ప్రసంగించి వెళ్లిన తర్వాత భారతీయ జనతా యువమోర్చా సభ్యులు గోమూత్రంతో శుద్ధిచేశారు. దీనిపై ట్విట్టర్ లో స్పందించిన ప్రకాశ్ రాజ్ తాను ప్రసంగించిన అన్ని చోట్లా ఇలానే శుద్ధిచేస్తారా అని ప్రశ్నించారు.