నిర్మాత బెల్లంకొండ సురేష్ తన కొడుకు శ్రీనివాస్‌ను ప్రేక్షకులకు స్టార్‌గా పరిచయం చేయాలనుకున్నాడు. ‘అల్లుడు శీను’ చిత్రంతో బెల్లకొండ శ్రీనివాస్ పరిచయం అయ్యాడు. ఆ చిత్రం బడ్జెట్ చూసి అంతా కూడా అవాకయ్యారు. కొత్త హీరో మూవీకి ఏకంగా 40 కోట్ల బడ్జెట్‌ను పెట్టడం, సమంత, తమన్నాలు హీరోయిన్స్ అవ్వడం అప్పట్లో సంచలనం అయ్యింది. సినిమా పాజిటిక్ టాక్ తెచ్చుకోవడంతో పాటు, బెల్లంకొండ శ్రీనివాస్‌కు అనుకున్న గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపును పోగొట్టుకోకుండా ఉండేందుకు బెల్లంకొండ శ్రీనివాస్ ఆ తదుపరి చిత్రాలు కూడా భారీ బడ్జెట్‌తోనే చేస్తూ వచ్చాడు. తాజాగా భారీ అంచనాల నడుమ రూపొందిన ‘సాక్ష్యం’ చిత్రం కూడా పాజిటివ్ టాక్‌ను దక్కించుకుంది. అయితే భారీ బడ్జెట్ పెట్టడంతో బడ్జెట్ రికవరీ కాలేదు.
సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్నా కూడా బడ్జెట్ రికవరీ కాకపోవడంతో బెల్లంకొండ శ్రీనివాస్ తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నాడు. ఇకపై చిన్న చిత్రాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. 10 నుండి 15 కోట్ల మద్య బడ్జెట్ చిత్రాలతో సినిమాలు చేయాలని ఈయన భావిస్తున్నాడు. కథ డిమాండ్ చేస్తే తప్ప 20 కోట్ల వరకు వెళ్ల వద్దనేది ఈయన నిర్ణయం.ఇప్పటి వరకు పెద్ద బడ్జెట్ చిత్రాలు, పెద్ద దర్శకులతో ఈయన చిత్రాలు చేశాడు కనుక అంతా చూశారు. ఇకపై ఈయన చేయబోతున్న చిత్రాలు చిన్న బడ్జెట్ చిత్రాలు మరియు చిన్న దర్శకులు అవ్వడంతో ప్రేక్షకులు ఈయన్ను పట్టించుకుంటారా అనే చర్చ మొదలు అయ్యింది. ఇప్పటికే విడుదలైన చిత్రాలతో ఒక మోస్తరు గుర్తింపు వచ్చింది కనుక, బడ్జెట్ విషయాన్ని పక్కన పెట్టి బెల్లంకొండ మూవీలను చూస్తారు అంటూ కొందరు అంటున్నారు. మొత్తానికి బెల్లంకొండకు ఇప్పుడు అసలు పరీక్ష మొదలు. ఇందులో సక్సెస్ అయితేనే సినీ ఇండస్ట్రీలో కొనసాగే అవకాశం ఉంటుంది.