Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆర్థిక రాజధానిని అతలాకుతలం చేసి యావత్ దేశాన్ని భయోత్పాతంలో ముంచెత్తిన ఆ క్రిమినల్ ను పట్టుకునేందుకు 24 ఏళ్లగా భారత్ చేయని ప్రయత్నం లేదు. ప్రత్యర్థి దేశంలో ఉంటూ సవాల్ విసురుతున్న ఆ నేరగాణ్ని స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వాలు ఎన్ని వ్యూహాలు రచించాయో లెక్కలేదు. దేశంలో రక్తపుటేరులు పారించిన ఆ నరహంతకుడుకి దాయాది దేశం ఆశ్రయమిచ్చి సకలమర్యాదలతో అతిథిలా చూస్తోందని ఎన్నోసార్లు అంతర్జాతీయ వేదికలపై భారత్ రుజువులు చూపిస్తూనే ఉంది. అయినా ఆ నేరగాడు చెక్కు చెదరలేదు. పైగా పొరుగు దేశంలో ఉంటూ భారత చీకటి సామ్రాజ్యాన్ని శాసిస్తున్నాడు. అతనే ముంబై పేలుళ్ల సూత్రధారి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం. ప్రపంచంలోనే సంపన్న నేరగాళ్లలో రెండో వాడైన దావూద్ ను భారత్ రప్పించడం ఇక సాధ్యం కాదనే అందరూ అంచనావేశారు.
ఈ నేపథ్యంలో దావూద్ గురించి సంచలన విషయాలు వెల్లడించాడు మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే. దావూద్ ఇబ్రహీం త్వరలోనే భారత్ వస్తాడన్నది ఆయన వ్యాఖ్యల సారాంశం. ఎన్నో ప్రభుత్వాలు అనేక వ్యయప్రయాసల కోర్చి…రక రకాలుగా ప్రయత్నించినా… ఇన్నేళ్లుగా సాధ్యం కానిది ఇప్పుడెలా జరుగుతుంది అంటే… దావూద్ తనంతట తానుగా భారత్ కు రావాలని భావిస్తుండడం వల్ల అని చెప్తున్నారు రాజ్ థాకరే. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న దావూద్ చివరి రోజుల్లో ఉన్నాడని… పుట్టి పెరిగిన భారత్ లోనే తుదిశ్వాస విడవాలని భావిస్తున్నాడని, ఈ విషయం తెలుసుకున్న బీజేపీ ప్రభుత్వం ఆయనతో సంప్రదింపులు జరుపుతోందని రాజ్ థాకరే వెల్లడించారు. దావూద్ ను దేశానికి రప్పించామని ప్రచారం చేసుకునేందుకు బీజేపీ తహతహలాడుతోందని కూడా ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసం ఈ అంశాన్ని వాడుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
తన అధికారిక ఫేస్ బుక్ పేజీ ప్రారంభం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో థాకరే ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్ థాకరే ఆరోపణలు ఇలా ఉంటే… ఇటీవల థానే పోలీసులు అరెస్టు చేసిన దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్ చెప్పిన వివరాలు మరోలా ఉన్నాయి. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి… ఆయన భయంతో దావూద్ తన రక్షణ ఏర్పాట్లను కట్టుదిట్టం చేసుకున్నాడని కస్కర్ వెల్లడించాడు. గతంతో పోలిస్తే… 50శాతం మేర భద్రతను పెంచుకున్నాడని తెలిపాడు. ఈ మూడేళ్ల కాలంలో దావూద్ నాలుగు సార్లు రక్షణ స్థావరం మార్చుకున్నాడని కూడా కస్కర్ చెప్పాడు. ఏది ఏమైనా దావూద్ ను భారత్ కు తీసుకువచ్చి తగిన శిక్ష విధించాలని, 1993 ముంబై పేలుళ్ల బాధితులు కోరుతున్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వం దావూద్ ను దేశానికి రప్పించగలదన్న నమ్మకాన్ని వారు వ్యక్తంచేస్తున్నారు.