Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయాలు ఎంత చిత్రంగా వుంటాయో ఈ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబుని చూసి అంచనా వేయొచ్చు. నాలుగేళ్ల కిందట ఆయన ఓ ప్రభుత్వ ఉద్యోగి. మూడేళ్ళకి ముందు హఠాత్తుగా టీడీపీ ఎమ్మెల్యే టికెట్ సాధించారు. అది కూడా సాక్షాత్తు బీజేపీ అగ్రనేత అద్వానీ సిఫార్సుతో. మూడేళ్లప్పుడు తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నారు , గెలిచారు, మంత్రి కూడా అయ్యారు. నాలుగు నెలల కిందట ఆ మంత్రి పదవి కోల్పోయారు. రాజకీయాల్లో ఇంత వేగంగా ఎదిగి అంతే వేగంగా కిందకు పడిపోయిన వ్యక్తి ఇంకెవరో కాదు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు.
పదవిలో వున్న మూడేళ్లపాటు రావెల మీద ఎన్నో వివాదాలు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు అంతంత మాత్రంగా వున్న తరుణంలో బీజేపీ తో పొత్తు గురించి తిరిగి ఆలోచిస్తామని చెప్పి సీఎం చంద్రబాబు చేతిలో చీవాట్లు తిన్నారు. ఇక రావెల కొడుకు హైదరాబాద్ లో ఓ వివాహితని వేధించిన కేసు విషయం అందరికీ తెలిసిందే. ఆ ట్రెండ్ కంటిన్యూ చేస్తూ ఆయన పుత్ర రత్నం గుంటూరు లో ఓ మహిళా హాస్టల్ ముందు చేసిన రచ్చ ఇంకా జనం మర్చిపోలేదు. ఇక తన భద్రత కోసం వున్న సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి కొన్ని గంటలపాటు మాయమైపోయిన రావెల అప్పట్లో ఓ సెన్సేషన్. ఇక ఆయన మమ్మల్ని పట్టించుకోవడం లేదని నియోజకవర్గ ప్రజలు ఫిర్యాదులు చేశారు. ఇక ఓ మైనారిటీ మహిళా నాయకురాలు మంత్రి గా వున్నప్పుడే రావెల మీద మీడియా కి ఎక్కి తన గోడు వెళ్లబోసుకుంది. ఇన్ని జరిగినా రావెల రూట్ మారలేదు. మంత్రి పదవి ఊడుతుందని తెలిసాక తెగింపు ఎక్కువైంది.
చంద్రబాబు సర్కార్ ని టార్గెట్ చేసిన మంద కృష్ణ మాదిగ కి ఏపీ లో అన్ని విధాలుగా రావెల అండదండగా వున్నారని లోకం కోడై కూసినా, సాక్షాత్తు బాబు ఆ విషయం లెవనెత్తినా ఆయన ట్రాక్ మార్చుకోలేదు. పైగా ఓ వైపు మంద కృష్ణకి షెల్టర్ ఇచ్చి అదే టైం లో సీఎం తో సమావేశం అయిన ఘన చరిత్ర ఆయనది. చంద్రబాబు అంటే మండిపడిపోయే బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ అని అందరికీ తెలుసు. ఆయన బర్త్ డే వేడుకల్లో రావెల కనిపించడం ప్రస్తుతం హాట్ టాపిక్. ఏమైనా టీడీపీ లో ఉంటూనే అధినేత ని తిట్టే వాళ్లకి దగ్గరగా మసులుతున్న రావెల ని చూస్తుంటే నేటి తరం రాజకీయాలకు అసలు సిసలు ప్రతినిధిలా కనిపిస్తున్నాడు.
మరిన్ని వార్తలు: