భారీ అంచనాల నడుమ రూపొందిన ‘నా పేరు సూర్య’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటం జరిగింది. ఏమాత్రం ఆకట్టుకోక పోవడంతో పాటు అల్లు అర్జున్‌కు తీవ్రంగా నిరాశ పర్చింది. అల్లు అర్జున్ పడ్డ కష్టం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరువలే మిగిలి పోయింది. మంచి కథా రచయితగా పేరు తెచ్చుకున్న వక్కంతం వంశీ ఈ చిత్రంతో దర్శకుడిగా కూడా మెప్పిస్తాడని అంతా భావించారు. కాని అనూహ్యంగా సినిమా ఫలితం తారు మారు అయ్యింది. మొదటి సినిమాతోనే దర్శకుడు వక్కంతం వంశీ అవకాశాల కోసం వెదుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. వంశీకి రెండవ ఛాన్స్ ఎవరు ఇస్తారా అని ఎదురు చూస్తున్న సమయంలో తానున్నాను అంటూ రవితేజ ముందుకు వచ్చాడు.
ఇటీవలే ‘నేలటికెట్’ చిత్రంతో అట్టర్ ఫ్లాప్‌ను తన ఖాతాలో వేసుకున్న రవితేజ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ చిత్రం విడుదల కాకుండానే విఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక చిత్రంను చేయబోతున్నాడు. ఆ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. ఆ తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం రవితేజ కోసం వంశీ స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. విఐ ఆనంద్‌తో సినిమా చేస్తున్న సమయంలోనే ఈ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది వీరి కాంబో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. రవితేజ సూపర్ హిట్ చిత్రం ‘కిక్’కు వక్కంతం వంశీ కథను అందించాడు. అందుకే ఆ విశ్వాసంను నిలుపుకుంటూ వక్కంతం వంశీకి రవితేజ ఛాన్స్ ఇచ్చి ఉంటాడు అంటూ సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.