ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కొద్ది రోజుల నుండీ చంద్రబాబు రిలీజ్ చేస్తున్న శ్వేతపత్రాపై ఆయన విరుచుకు పడ్డారు. హైకోర్టు విభజనలో కేంద్రం తప్పేమీ లేదని, హైదరాబాద్ ఐటీ అభివృద్ధిలో చంద్రబాబు పాత్రమీ లేదని తేల్చి చెప్పారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం అవసరం అయితే ప్రధానికి లేఖ రాస్తానని ప్రకటించారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విష్యం ఏంటంటే బీసీ రిజర్వేషన్ల వివాదంపై మాట్లాడేందుకు ప్రెస్ మీట్ పెట్టి.. చంద్రబాబును టార్గెట్ చేశారు. హైకోర్టును హడావుడిగా విభజించలేదని డిసెంబర్ నాటికి హైకోర్టును తరలిస్తామని ఏపీ ప్రభుత్వమే చెప్పిందని దాని ప్రకారమే విభజించారనని అన్నారు. చంద్రబాబు దేశంలోనే అత్యంత డర్టీ పొలిటీషియన్ అని మండిపడ్డారు. రెండు రాష్ట్రాలకు పారిశ్రామిక రాయిలీలు ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా ఉందని కేసీఆర్ ప్రకటించారు. రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం నిధులు ఇస్తోందని కేసీఆర్ ప్రకటించారు. నిజానికి మొదటి ఏడాది లోటు భర్తీ చేయాల్సి ఉన్నా కేంద్రం చేయలేదని ఏపీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మిగతా సమయాల్లో.. ఆర్థిక సంఘం నివేదిక మేరకు లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రాలకు ఇచ్చినట్లుగానే ఇస్తోంది.
అయినా కేసీఆర్ కేంద్రం విభజన చట్టం మేరకు ఇస్తోందని కేంద్రాన్ని వెనకేసుకొస్తున్నారు. చంద్రబాబు పచ్చి రాజకీయ స్వార్థపరుడని మామ పెట్టిన పార్టీని చంద్రబాబు లాక్కొన్నారని విమర్శించారు. తాను చంద్రబాబులా కాదని కేవలం ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చానని చెప్పుకొచ్చారు. రైతు బంధు పథకాన్ని దేశం మొత్తం ఫాలో అవుతోందని మా పథకాలను చంద్రబాబు కాపీ కొట్టారని కేసీఆర్ ఆరోపించారు. కల్యాణలక్ష్మిని కాపీ కొట్టారని, హైదరాబాద్ ఐటీలోనూ చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. హైదరాబాద్ భౌగోళిక అనుకూలత వల్లే ఐటీ కంపెనీలొచ్చాయని తాము కూడా నాలుగైదు పెద్ద ఐటీ కంపెనీలు తెచ్చాం అయితే చంద్రబాబులా మేం డబ్బా కొట్టుకోలేదన్నారు. చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపైనా విమర్శలు చేశారు. శ్వేతపత్రంలో చాలా చేశామని చంద్రబాబు చెబుతున్నారని ఇంకో పక్క హోదా కావాలని చిప్ప చేత పట్టుకుంటారని ఇలా అయితే ఎలా అని ప్రశ్నించారు ? అంతేకాక ఏపీ ప్రత్యేకహోదా విషయంలో మాట మార్చారు. ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేకహోదాకు తాము ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని, తను, ఎంపీ కేకే,మరో ఎంపీ కవిత.. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని కూడా చెప్పుకొచ్చారు. ఎందుకంటే గతంలో మోదీ ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలో ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడాన్ని టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లోనే వ్యతిరేకించారు. గతంలో కవిత ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మద్దతు పలికినా తీరా ఏ అంశం మీద అవిశ్వాస తీర్మానం పెట్టారో అప్పుడే హ్యాండిచ్చారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందని వారు ఎదురు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదికాక సోనియా గాంధీ తెలంగాణ ప్రచారసభలో ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామన్నప్పుడు కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలంతా బహిరంగసభల్లో విమర్శలు గుప్పించారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కానీ అలాంటి కేసీఆర్ ఇప్పుడు అవసరం అయితే ఏపీకి ప్రత్యేకహోదా కోసం లేఖ రాస్తామని చెప్పడం.. వెనుక రాజకీయ వ్యూహం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకహోదా అంశంలో కేసీఆర్ యూటర్న్ తీసుకోవడానికి కారణం మెల్లగా వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీని ఫెడరల్ ఫ్రంట్ లోకి చేర్చుకోవడమేనన్న విశ్లేషణ ప్రారంభమయింది. ప్రత్యేకహోదా ఇస్తామన్న వారికే తమ మద్దతని వైసీపీ చెబుతోంది. ఇప్పుడు కేసీఆర్ అదే చెప్పడం వైసీపీని కూటమిలో చేర్చుకోవడమేనని అంచనా వేస్తున్నారు.