ఓ రజని …ఓటమిని ఎదుర్కొనే ధైర్యం ఉంటేనే గెలుపు.

reason-behind-Superstar-Rajreason-behind-Superstar-Raj

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పటికి పదిపదిహేను సార్లు రాజకీయ రంగంలోకి వస్తానని మళ్లీ వెనకడుగు వేశారు. తమిళ సినీ అభిమానులు దేవుడిలా కొలుచుకునే అంతటి స్టార్ ఇన్ని సార్లు ఇలా చేయడం ఏంటి అన్న సందేహాలు సహజంగానే వస్తాయి. దానికి రజని అండ్ కో ఎన్ని కారణాలు అయినా చెపుకోవచ్చు. ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నామని తమకు తాము, ప్రపంచానికి సర్ది చెప్పుకోవచ్చు. అయితే ఇవేమీ నిజం కాదు. రాజకీయాల్లో తాను ఓడిపోతే అన్న భయమే ప్రతిసారీ వెనక్కి లాగుతోంది. తాను పెట్టే కొత్త పార్టీ ఓడిపోతే సినీ రంగం ద్వారా ఇప్పటిదాకా లభిస్తున్న గౌరవం ఇకపై దొరకదేమోనని రజని సందేహం. అందుకే రాజకీయం విషయంలో ఓ అడుగు ముందుకు వేస్తే రెండు అడుగులు వెనక్కి వేస్తున్నారు.

డిసెంబర్ 12 అంటే నేడు రజని పుట్టిన రోజు. ఈ మధ్యే రాజకీయాల లోకి వచ్చే ఆలోచన లేదన్న రజని పుట్టిన రోజు సందర్భంగా కొత్త నిర్ణయం ఏదైనా ప్రకటిస్తారేమోనని ఆయన అభిమానులు ఎక్కడో ఆశ పెట్టుకున్నారు. తన బర్త్ డే సందేశం గా రజని ఏమి చెబుతారో అన్న ఉత్కంఠ నెలకొన్న మాట నిజం. అయితే ఈ సందర్భంగా రజని ఓ మాట గుర్తు పెట్టుకోవాలి. “ ఓటమిని ఎదుర్కొనే సత్తా వున్నవాడినే గెలుపు పలకరిస్తుంది.” . ఇలా ఓ కొటేషన్ చెప్పి స్ఫూర్తి రగల్చడానికి రజని చిన్న పిల్లాడు కాదు . యువకుడు అంత కన్నా కాదు. 60 ఏళ్లకు పైగా జీవితం…పేదరికం నుంచి స్టార్ స్టేటస్ , వ్యసనాల నుంచి ఆధ్యాత్మిక ప్రయాణం …ఇవన్నీ చూసిన మనిషి. కాస్త వెనక్కి తిరిగి చూసుకుంటే రజనికి ఓ విషయం అర్ధం అవుతుంది. కెరీర్ తొలిదశలో కమల్ లాంటి మహానటుడు , అందగాడితో పోటీ పడేటప్పుడు రజని తాను ఇంత స్టార్ అవుతాను ఆనుకొని వుండరు. తనపై తనకు పెద్దగా అంచనాలు ఉండి వుండవు. అనిశ్చిత భవిష్యత్ మీద ఆశ తప్ప. అందుకే ఏ ఒత్తిడి లేకుండా వచ్చిన అవకాశాల్లో మనసుకు నచ్చిన వాటిని చేసుకుంటూ వెళ్లిపోయారు.పదేపదే ప్రయత్నాలు , కొన్ని ఓటములు తర్వాత రజని అనుకున్న కాదుకాదు ఊహించని స్టార్ డమ్ వచ్చింది. మొదటి నుంచి కమల్ తో పోటీ , హిట్ అయ్యే సినిమా మాత్రమే చేయాలి అనుకుంటే నేటి స్థాయి వచ్చేదా ?

ఇక ఈ హీరో స్టేటస్ వచ్చాక దాన్ని హ్యాండిల్ చేయలేక రజని కొన్నాళ్ళు వ్యసనాల బారిన చిక్కుకున్నారు. భార్య లత చూపిన దారితో మళ్ళీ ట్రాక్ లోకి రావడమే కాదు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. రజని ఓ స్టార్ గా చూసే భారతీయుల్లో ఎక్కువమంది ఆయనలోని నటుడిని చూసి కాక వ్యక్తిని చూసి అభిమానిస్తారు అన్నది పచ్చి నిజం. ఆ వ్యక్తిత్వం కూడా ఒకప్పుడు వ్యసనాలు , బలహీనతలు దాటుకు వచ్చిందే. ఇవన్నీ వెనక్కి తిరిగి చూసుకుంటే తన జీవితమే రజనికి పెద్ద ఉదాహరణ. ఎక్కడా గెలుపుకి గ్యారంటీ ఉండదు. ఓడిపోడానికి సిద్ధపడి ముందుకు వెళితే , పదేపదే ప్రయత్నిస్తే గెలుపు వచ్చి తీరుతుంది. రాకున్నా పర్లేదు. గెలుపే జీవితం అనుకుంటే ఈ భూమి మీద ఒక్క మనిషి కూడా ప్రశాంతంగా వుండలేడు. ఏ గెలుపు అయినా జీవితంలో ఓ మజిలీ మాత్రమే అంతిమ గమ్యం కాదు.