Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్నికల వేళ అన్ని పార్టీల రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉంటారు. విందులు, వినోదాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. ఇలాంటి కార్యక్రమాల్లో ఏమాత్రం తేడా వచ్చినా ఎన్నికల వేళ అవే ప్రధానాంశాలుగా మారతాయన్న భయం వారిని వెంటాడుతుంటుంది. దీంతో సాధ్యమయినంత సింపుల్ గా కనిపించేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించి విమర్శలకు కేంద్రబిందువుయ్యారు.
కర్నాటకలో అత్యంత కరువు ప్రభావిత జిల్లాగా కల్బుర్గి రికార్డులకెక్కింది. రైతులు కనీస మద్దతు ధర లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓ విందుకోసం ఏకంగా రూ.పదిలక్షలు ఖర్చుపెట్టినట్టు వార్తలు రావడం వివాదాస్పదమయింది.
ఈ నెల 16న సీఎం, ఆయన మంత్రివర్గ సహచరులకు విందు ఇచ్చేందుకు జిల్లా అధికారులు రూ. పదిలక్షలు ఖర్చుచేశారని కల్బుర్గి మాజీ బీజేపీ అధ్యక్షుడు రాజ్ కుమార్ తెల్కూర్ ఆరోపించారు. ఒక్కో ప్లేట్ కు రూ. 800 ఖర్చు చేశారని, కొందరు వీవీఐపీలకు వెండి కంచాలు, బౌల్స్ లో వడ్డించారని తెలిపారు. రైతులు ఓ పక్క ఆకలితో అలమటిస్తోంటే…సీఎం, ఆయన మంత్రివర్గ సహచరులు మాత్రం రూ.800 ఖరీదైన భోజనం చేయడం ద్వారా కరువు బాధిత జిల్లా ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సిద్దరామయ్య తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పి వారిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఆరోపణలపై కర్నాటక ప్రభుత్వం ఎలాంటి వివరణా ఇవ్వలేదు.