Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
20 ఏళ్ల క్రితం కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ కు జోధ్ పూర్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన రెండు రోజుల తర్వాత సెషన్స్ కోర్టు ఆయనకు ఊరటనిచ్చింది. రూ. 50వేల పూచీకత్తుపై సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రవీంద్రకుమార్ జోషి సల్మాన్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరుచేశారు. కోర్టు అనుమతి లేకుండా సల్మాన్ దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదని న్యాయమూర్తి ఆదేశించారు. బెయిల్ పై న్యాయమూర్తి నిర్ణయం ప్రకటిస్తున్న సమయంలో సల్మాన్ సోదరీమణులు అల్వితా, అర్పిత కోర్టులోనే ఉన్నారు. బెయిల్ నిర్ణయం విని వారు సంతోషం వ్యక్తంచేశారు. నిజానికి సల్మాన్ బెయిల్ పిటిషన్ పై శుక్రవారమే విచారణ జరగాల్సి ఉండగా… సల్మాన్ కు బెయిల్ ఇవ్వాలా… వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోడానికి కేసును పూర్తిగా పరిశీలించాలని అభిప్రాయపడిన న్యాయమూర్తి ఇవాళ్టికి వాయిదా వేశారు.
ఈ లోపు రాజస్థాన్ లో న్యాయమూర్తుల బదిలీలు జరిగాయి. సల్మాన్ బెయిల్ పిటిషన్ ను విచారించాల్సిన రవీంద్రకుమార్ జోషి, సల్మాన్ కు జైలుశిక్ష విధించిన దేవ్ కుమార్ ఖత్రికి కూడా బదిలీ అయింది. దీంతో సల్మాన్ బెయిల్ పై అనిశ్చితి నెలకొంది. ఉదయం జోషి కోర్టుకు హాజరుకావడంతో సందిగ్ధత తొలగిపోయింది. రెండురోజుల కారాగారవాసం తర్వాత సల్మాన్ జైలు నుంచి బయటకు రానున్నారు. ఇదే కేసులో సల్మాన్ 1998, 2006,2007 సంవత్సరాల్లో మొత్తం 18 రోజులు జోధ్ పూర్ జైల్లో గడిపారు. దోషిగా నిర్ధారణ అయి శిక్ష విధించిన తర్వాత మాత్రం రెండురోజులకే జైలు నుంచి సల్మాన్ కు విముక్తి లభించడం గమనార్హం. సల్మాన్ కు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు మద్దతుగా నిలబడడంతో పాటు చేసిన నేరానికి మించీ ఎక్కువ శిక్ష పడిందన్న అభిప్రాయమూ వినిపించిన నేపథ్యంలో ఆయనకు బెయిల్ రావడంపై పలువురు ప్రముఖులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.