Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ట్రిపుల్ తలాక్ ను నిషేధిస్తూ… సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ముస్లిం మహిళల నుంచి పెద్ద ఎత్తున హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. ఎన్నోఏళ్లుగా దీనిపై ముస్లిం మహిళల్లో వ్యతిరేకత ఉంది. గతంలో కొందరు మహిళలు న్యాయస్థానాలను ఆశ్రయించినా..మత సంబంధ వ్యవహారం కావటంతో అనుకున్న ఫలితం దక్కలేదు. అయితే ఓ మహిళ మాత్రం పట్టు వీడకుండా…ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా చివరిదాకా పోరాడారు. సుప్రీంకోర్టు తీర్పులో ఆ మహిళ పాత్ర కీలకం. ఆమే షయరాబానో.
ఉత్తరాఖాండ్ లోని కాశీపూర్ కు చెందిన ఒక మధ్యతరగతి ముస్లిం మహిళ షయరా. సోషియాలజీలో పీజీ చేసిన షాయరాకు 2001లో పెళ్లయింది. ఒడిదొడుకుల మద్య 14 ఏళ్ల కాపురం సాగిన తర్వాత స్పీడ్ పోస్ట్ లో తలాక్ తలాక్ తలాక్ అని మూడుసార్లు రాసిన కాగితం పంపి షయరా బానో భర్త ఆమెకు విడాకులు ఇచ్చారు. భర్త చర్యతో షాక్ తిన్న షయరా తొలుత మతపెద్దల దగ్గరకు వెళ్లారు. తలాక్ చెల్లుతుందని వారు చెప్పటంతో ఆమె కోర్టును ఆశ్రయించారు. కింది కోర్టుల విచారణ తర్వాత 2016 ఫిబ్రవరిలో షయరా సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఏకపక్షంగా ఉన్న ట్రిపుల్ తలాక్ ను రద్దు చేయాలని, ఈ నిబంధన వల్ల చట్టం దృష్టిలో స్త్రీ పురుషులు సమానమన్న ప్రాథమిక రాజ్యాంగ హక్కుకు భంగం కలుగుతోందని వాదించారు.
కోర్టులో కేసు విచారణ సాగుతుండగానే… ట్రిపుల్ తలాక్ ను నిషేధించాలంటూ మరికొంతమంది ముస్లిం మహిళలు సుప్రీంను ఆశ్రయించారు. షయరా వాదనతో ఏకీభవించిన కోర్టు ట్రిపుల్ తలాక్ ను ఆరునెలల పాటు రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ లోగా దీనిపై చట్టం తీసుకురావాలని పార్లమెంటును ఆదేశించింది. తీర్పుపై ముస్లిం మహిళలు సంతో షం వ్యక్తంచేస్తున్నారు. ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేసే కాలంలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని షయరా చెప్పారు. ముస్లిం పెద్దల నుంచి తనకు తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చిందని, కేసును వెనక్కు తీసుకోవాలని, ఇస్లాం కోసం త్యాగం చేయాలని ఒత్తిడి చేశారని షయరా చెప్పారు. 1400 ఏళ్ల నుంచి దేశంలో అమల్లో ఉన్న ట్రిపుల్ తలాక్ పై సమాజంలోనూ వ్యతిరేక భావన ఉంది. దీన్ని గ్రహించిన కేంద్రం దీనిపై విస్తృత చర్చ జరిగేలా పావులు కదిపింది. దేశమంతా ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా ఉండటంతో కేంద్రం పని సులువయింది. మొత్తానికి ముస్లిం సమాజంలో పాతుకుపోయి ఎందరో మహిళల జీవితాల్లో అంధకారం నింపిన ఓ దురాచారానికి అన్ని వర్గాల మద్దతుతో సుప్రీంకోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది.
మరిన్ని వార్తలు: