Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏ క్రికెటర్ అయినా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయ్యేటప్పుడు చాలా హుందాగా వ్యవహరిస్తాడు. తన కెరీర్ లో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాడు. కెరీర్ లో అద్భుతంగా రాణించిన క్రికెటర్ అయితే భావోద్వేగంతో రిటైర్మెంట్ ప్రకటిస్తాడు.. సరైన అవకాశాలు లేకో, మరే కారణం చేతో ఆటలో రాణించలేకపోయినవాళ్లు కూడా చివరిరోజు మౌనంగానే మైదానాన్ని వీడతారు. వివాదాస్పద క్రికెటర్లుగా పేరు తెచ్చుకున్న వాళ్లు సైతం… రిటైర్మెంట్ సమయంలో మాత్రం గత అంశాల జోలికి వెళ్లకుండా ఆట ముగిస్తారు. కానీ పాకిస్థాన్ వివాదాస్పద క్రికెటర్ సయీద్ అజ్మల్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించాడు. తన రిటైర్మెంట్ సందర్భంగానూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
అజ్మల్ బౌలింగ్ యాక్షన్ సరిగ్గా లేదన్న కారణంతో ఐసీసీ రెండు సార్లు అతనిపై నిషేధం విధించింది. రిటైర్మెంట్ సందర్భంగా అజ్మల్ ఐసీసీ చర్యలను తప్పుబట్టాడు. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఒక సవాల్ కూడా విసిరాడు. తన వయసు 40 ఏళ్లని, తాను రిటైర్ అవుతున్నానని చెప్పిన అజ్మల్ తాను తప్పుకుని యువ క్రికెటర్లకు అవకాశం కల్పించాలనుకుంటున్నానని తెలిపాడు. అయితే ఎంతో అసంతృప్తితో తాను రిటైర్ అవుతున్నానని, ఇందుకు ప్రధాన కారణం ఐసీసీ అని అజ్మల్ ఆరోపించాడు.
బౌలింగ్ శైలి సరిగ్గా లేదంటూ తనపై రెండుసార్లు నిషేధం విధించారని ఆవేదన వ్యక్తంచేశాడు. ఈ సందర్భంగా తాను ఐసీసీకి ఒక సవాల్ విసురుతున్నానని, ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ ఆడుతోన్న బౌలర్లకు ఒకసారి పరీక్ష నిర్వహిస్తే అందులో 90శాతం మంది ఫెయిలవుతారని, ఇందులో ఎలాంటి సందేహం లేదని అజ్మల్ చాలెంజ్ చేశాడు. అలాగే సచిన్ పైనా అజ్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 2011 ప్రపంచకప్ లో భారత్ పాక్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ గురించి అజ్మల్ ప్రస్తావించాడు. ఆ మ్యాచ్ లో సచిన్ 85 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయితే 37వ ఓవర్లో తన బౌలింగ్ లోనే సచిన్ ఆఫ్రిదికి క్యాచ్ ఇచ్చాడని, అంతకుముందు కూడా తన బౌలింగ్ లో ఓసారి సచిన్ వికెట్ల ముందు దొరికిపోయాడని, ఈ రెండుసార్లు అంపైర్ ఔటివ్వలేదని…ఇలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ తనకు అర్ధం కాలేదని అజ్మల్ వ్యాఖ్యానించాడు. మొత్తానికీ వివాదాస్పద బౌలర్ తన కెరీర్ ను కూడా వివాదాస్పద వ్యాఖ్యలతోనే ముగించాడన్నమాట.