Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత కొన్ని వారాలుగా తమిళనాట కొత్త సినిమాల విడుదల కానివ్వడం లేదు. డిజిటల్ ప్రొవైడర్ల తీరుకు నిరసనగా నిర్మాతలు బంద్‌ను పాటిస్తున్నారు. అయితే ఎంతకాలం అని బంద్‌లో పాల్గొంటామని కొందరు చిత్రీకరణ జరుపుతుండటంతో పాటు, మరి కొందరు తమ సినిమాల విడుదలకు సిద్దం అవుతున్నారు. తాజాగా నయనతార నటించిన ‘వాసుకి’ చిత్రాన్ని తమిళంలో విడుదల చేయడం జరిగింది. మలయాళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ‘వాసుకి’ చిత్రాన్ని తమిళంలో విడుదల చేసేందుకు నిర్మాత చాలా రోజులుగా ఎదురు చూశాడు. అయితే సినిమా ఇండస్ట్రీ బంద్ కారణంగా వాయిదా వేస్తూ వచ్చాడు. తాజాగా చిత్రంను విడుదల చేయడం జరిగింది.
తమిళ సినిమా పరిశ్రమలో బంద్ జరుగుతున్న ఈ సమయంలో ‘వాసుకి’ చిత్రాన్ని విడుదల చేయడంపై తమిళ నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ చిత్రంలో నటించిన నయనతారపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. చెన్నైలోని నయనతార ఇంటిని తమిళ నిర్మాతలు చుట్టుముట్టి ఆందోళన నిర్వహించారు. ఈ విషయమై తాజాగా నయన్ స్పందిస్తూ తనకు సినిమా విడుదలలో ఎలాంటి సంబంధం లేదని, అసలు ఆ సినిమాను తమిళంలో విడుదల చేసింది ఎవరో కూడా తనకు తెలియదు అని, ఆ సినిమా ప్రమోషన్స్‌కు కూడా తనను పిలువలేదని చెప్పుకొచ్చింది. ఈ వివాదంలో తనను లాగవద్దని తమిళ నిర్మాతలకు నయనతార విజ్ఞప్తి చేసింది. తమిళ సినీ నటీనటులు కూడా నయనతారకు మద్దతుగా నిలిచారు. నయనతారకు ఈ వివాదంతో సంబంధం లేదని, ఆమెకు ఏ పాపం తెలియకున్నా ఆమెపై విమర్శలు చేయడం మంచి పద్దతి కాదు అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నయనతార తెలుగులో చిరంజీవికి జోడీగా సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తూ ఉంది. హైదరాబాద్‌లో ఉన్న నయన్ ఫోన్ ద్వారా తమిళ నిర్మాతలతో మాట్లాడినట్లుగా తెలుస్తోంది.