సీనియర్ నటుడు రాకెట్రామనాథన్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి 10 గంటలకు తుదిశ్వాస విడిచారు. స్టేజీ ఆర్టిస్ట గా, మిమిక్రీ కళాకారుడిగా గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించిన రామనాథన్ ఆ తర్వాత చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. శివాజీ గణేశన్, ఎంజీఆర్, రజనీకాంత్, కమల హాసన్ తదితరుల గొంతును అనుకరించడంలో దిట్టగా పేరుగాంచిన రామనాథన్ను తమిళనాడు ప్రభుత్వం ‘కలైమా మణి’ బిరుదుతో సత్కరించింది.ఒరు పుల్లాంకుళల్ అడుప్పు ఊదుదు, స్పరిశం, వలత్తకడా, మన్సోరు, నామ్, వరం వంటి పలు చిత్రాల్లో నటించిన ఆయన పలు అవార్డు అందుకున్నారు. ఆయన నటీనటుల సంఘం నుండి కలై సెల్వం అనే పురస్కారాన్ని కూడా సొంతం చేసుకున్నారు. ఆయనకు భార్య భానుమతి, కుమార్తె సాయి బాలా, కుమారుడు సాయిగురు బాలాజీలు ఉన్నారు. అనారోగ్యంతో చెన్నైలో మృతి చెందిన రామనాథన్ అంత్యక్రియలు నిన్న ఆయన స్వస్థలం రాయపేటలో జరిగాయి. ఆయన మృతికి తమిళ పరిశ్రమ సంతాపం ప్రకటించింది.