ఆపరేషన్ బీ మొదలు…30 మంది టీడీపీ నేతల మీద ఐటీ దాడులు…!

Tammareddy Bharadwaj Reveals Operation B Secrets LIST

ఆపరేషన్ గరుడ ఫెయిల్ అయ్యేసరికి ఆపరేషన్ బి త్వరలోనే ప్రారంభమవుతుందని ప్రముఖ సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజ ప్రకటించి సంచలనం రేపారు. రేపటి నుంచి పదిహేను రోజుల్లోగా ఈ ఆపరేషన్ ప్రారంభమవుతుందని నిన్న మొన్నటి వరకూ వ్యాపారస్థులపై జరిపిన ఐటీ, ఈడీ దాడులు ఈసారి నేరుగా పార్లమెంటు సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలపై జరుగుతాయని తమ్మారెడ్డి ఒక న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నలుగురు మంత్రులు, 24 మంది వివిధ వ్యాపారాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, తెలుగు దేశం అధినేత, మరియు ఎమ్మెల్యే లు వల్లభనేని వంశీ మోహన్,బొడే ప్రసాద్,బూరుగుపల్లి శేషారావు, ఆలపాటి రాజేందరప్రసాద్,కొమ్మాలపాటి శ్రీధర్, సిద్ధా రాఘవరావు, ఎంపీ లు సీఎం రమేష్, మురళీమోహన్, విజయవాడ లోని ప్రముఖ హోటల్ డీవీ మానర్ యజమాని, KL యూనివర్సిటీ అధినేత పై త్వరలో ఐటీ, ఈడీ దాడులు జరగబోతున్నట్లు తమ్మారెడ్డి తెలిపారు.

IT-Raids

ఇందుకోసం పీఎంవోలో ఒక అధికారి ప్రత్యేకంగా పనిచేస్తున్నారని కూడా చెప్పారు. అయితే ఇందులో నిజానిజాలు తనకు పూర్తిగా తెలియవని, తనకు అందిన సమాచారాన్నే బయటపెడుతున్నానని తమ్మారెడ్డి చెప్పడం విశేషం. ఆపరేషన్ గరుడ విషయంలో సినీ హీరో శివాజీని లోపల వేసి, విచారణ జరిపించాలని బీజేపీ, వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారని… ఇప్పుడు మిమ్మల్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయమంటారేమో అనే ప్రశ్నకు బదులుగా… విచారణ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చని చెప్పారు. ఇందులో భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. తనకు తెలిసిన విషయాన్నే తాను చెప్పానని తెలిపారు. జాతీయ రాజకీయాల్లో బాబు చురుగ్గా పాల్గొనకుండా ఉండేందుకే ఈ దాడులు జరగుతాయని ఆయన చెప్పారు.

thamma-reddy

ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం వల్లే ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిందని అందువల్లే టీడీపీని ఇబ్బందులపాలు చేసే ప్రయత్నాన్ని బీజేపీ చేస్తోందని తమ్మారెడ్డి విమర్శించారు. టీడీపీకి చెందిన నేతలను దొంగలుగా చూపించడం వల్ల జనాల్లో టీడీపీని చులకన చేయాలనేది బీజేపీ ఆలోచన అని చెప్పారు. 30 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలను దొంగలుగా చూపెడితే ఓటర్లలో దాని ప్రభావం ఎంత స్థాయిలో ఉంటుందో ఊహించగలమని అన్నారు. తనకు చంద్రబాబుపై ప్రత్యేకమైన అభిప్రాయం ఏమీ లేదని గతంలో ఆయనను విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయని అయితే, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయడం మాత్రం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు.

It Raids On southern Developers And Vrl Logistics In Ap

తనకు ఎదురు తిరిగిన వారందరినీ తొక్కేయాలనుకోవడం నియంతృత్వం అవుతుందని… అది ప్రజాస్వామ్యం కాదని తమ్మారెడ్డి తెలిపారు. టీడీపీ నేతలు దొంగలైనప్పుడు ఎన్డీయేతో టీడీపీ కలిసున్నప్పుడే దాడులు చేసి ఉందవచ్చని… విడిపోయిన తర్వాతే ఎందుకు చేయాలని ప్రశ్నించారు. ఇదంతా అవకాశవాదమే అని చెప్పారు. దక్షిణాదిలో పాతుకుపోవడం అంత ఈజీ కాదనే విషయం కర్ణాటక ఉపఎన్నికల్లో బీజేపీకి తెలిసిపోయిందని… అందుకే ‘ఆపరేషన్ బి’ని ప్రారంభించారని అన్నారు.