విభజన హామీల అమలు విషయంలో విభేదాలు రావడంతో కేంద్ర, రాష్ట్ర అధికార పక్షాలు విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే విభజన హామీల అమలు కోసం టీడీపీ పోరాటాన్ని ఉధృతం చేసింది. మొన్న కడప ఉక్కు పరిశ్రమ కోసం ఎంపీ సీఎం రమేష్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తే నేడు విశాఖ రైల్వే జోన్ కోసం పార్టీ ఎంపీలు ఆందోళనకు దిగారు. జోన్ సాధనే లక్ష్యంగా కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నంలో భాగంగా విసాక రైల్వే స్టేషన్ సమీపంలో ఒక్కరోజు నిరాహార దీక్షను చేపట్టారు. ఈ దీక్షలో ఎంపీలతో పాటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ నేతలు కూడా పాల్గొన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన దీక్ష సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
జోన్ ఇవ్వాలని కేంద్ర పెద్దలకు ఉంటే అవకాశాలు మెండుగా ఉన్నాయని, చట్టంలో ఉన్నా ఇవ్వకుండా రాష్ట్రంపై పగ సాధిస్తున్నారని పొరుగు రాష్ట్రం ఒడిశా అభ్యంతరం చెబుతుందని వంకలు చెప్పడం బీజేపీ చిత్తశుద్ది అని నేతలు విమర్శించారు. అలాగే జోన్ కోసం జరుగుతున్న పోరాటానికి విపక్షాలు కూడా కలిసి రావాలని రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో ఉద్యమించాలని జోన్‌తో విభజన హామీలను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామంటున్నారు.