తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల అంకం ఈరోజుతో ముగియనుంది. అంతేకాకుండా నామినేషన్ల ఉపసంహరణకు కూడా గడువు నేడే అవ్వడంతో బరిలోకి దిగిన ప్రధాన పార్టీలు తమకి పోటీగా నిలబడిన రెబెల్స్ ను బుజ్జగించి, నామినేషన్లను ఉపసంహరించేందుకు వీలుగా కోట్లల్లో భేరసారాలతో బుజ్జగిస్తున్నారు. నియోజకవర్గాన్ని బట్టి ఈ బేరసారాలు కొన్ని లక్షల నుండి కోట్ల వరకు పలుకుతున్నాయి. తమ ఉపసంహరణకు అడిగినంత సొమ్ము ముట్టచెప్పాల్సిందేనని నియోజకవర్గంలో పట్టున్న రెబెల్ అభ్యర్థులు బెట్టు చేస్తుండగా, అంతివ్వలేమని చెప్పి, ఎంతకో అంతకి తేల్చేందుకు బ్రతిమాలాడటాలు వంటివి చేస్తున్నారు. దీన్నిబట్టి, ఈరోజు జరిగే భేరసారాల్లో ఎన్ని కోట్లు చేతులు మారుతాయో అనేది ఎవ్వరూ ఊహించలేని మొత్తమే. చెప్పాలంటే ఇది ఎన్నికలకి జరిగే రాజకీయ వసూళ్ల వ్యవహారం వంటిది.
ఎన్నికల్లో గెలిచితీరాలని కొందరు నామినేషన్ వేస్తే, ముందుగా నామినేషన్ వేసి, ఉపసంహరణ రోజున ప్రధాన పార్టీ అభ్యర్థులకు ఎన్నిక సులువుగా అయ్యేందుకు, ఓట్లు తెగకుండా బరిలోకి దిగిన రెబెల్స్ కి ఎంతో కొంత మొత్తం సెటిల్ చేసే అవకాశాన్ని వినియోగించుకొని, కోట్లల్లో సొమ్ము దక్కించుకోవాలని వేసే ఎత్తుగడలు మరొకరివి.ఇటువంటి రెబెల్స్ కోరికలు సాధ్యమైనంతవరకు తీర్చి, పోటీనుండి వైదొలిగేట్లు చేయడానికి ప్రధాన పార్టీ అభ్యర్థులందరూ కోట్లలో సొమ్ము సిద్ధం చేసుకొనితీరాల్సిందే. అంతెందుకు గ్రేటర్ హైదరాబాద్ లో బరిలోకి దిగిన ప్రధాన పార్టీ అభ్యర్థి విజయం ఏకపక్షం కావడానికి, రెబెల్ గా నిలబడ్డ పలుకుబడిగల అభ్యర్థి అడిగిన మొత్తం అక్షరాలా యాభై కోట్లు అని వినికిడి.
అంతమొత్తం ఎవ్వరూ ఇవ్వలేరనుకోండి కానీ ఒకట్ల సంఖ్యలో కోట్లు ఇవ్వడానికి చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది.అలా తగ్గని పక్షంలో, రెబెల్స్ మరియు స్వతంత్ర అభ్యర్థులకు రాబోయే రోజుల్లో పార్టీ తరపున పదవులు కల్పిస్తామని ఆశలు కూడా చూపిస్తారు. తెలంగాణలో అంత్యంత కీలకమైన గ్రేటర్ హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాలో అయితే ఈ భేరసారాలు కోట్ల రూపాయలకు ఏమాత్రం తగ్గనే తగ్గవు. అంతేమరి ఎన్నికలు అంటే కొందరికి వసూళ్లు తెచ్చిపెట్టే బంగారు బాతు. నిలబడ్డా, వైదొలిగినా లాభమే.