తెలంగాణ సంస్కృతీకి ప్రతీకయిన బోనాల జాతర ఏర్పాట్లపై టీఆరెస్ ప్రభుత్వం దృష్టిపెట్టింది. ప్రతీ ఏటాలానే సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా పండుగను ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. జూలై 4 న బోనాల జాతర జరుగనుంది. జూలై 4 గోల్కొండ బోనాలు, జూలై 21న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, జూలై 28న పాతబస్తిలో బోనాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసి ద్వారా సుమారు రూ.15 కోట్లతో వివిధ పనుల కోసం ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. ఈ నిధులతో రోడ్ల మరమ్మత్తులు సానిటేషన్ ఏర్పాట్లను దేవాలయాల వద్ద లైటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ మూడు లక్షల తాగు నీటి ప్యాకెట్లను ఏర్పాటు చేయనుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే వారి కోసం ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులు నడుపుతుందని అయన ప్రకటించారు. దేవాలయాల వద్ద సాంస్కృతిక శాఖ సహకారంతో సాంస్కృతిక, భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. అటు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన 26 దేవాలయాలకు పట్టు వస్త్రాలను పంపనునట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. బోనాల జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి, ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.