వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరెస్టయి జైలులో ఉన్నప్పుడు ఆయన సోదరి వైఎస్ షర్మిల పార్టీని భుజాన వేసుకొని నడిపించారని వైఎస్ వివేకా కుమార్తె సునీత అన్నారు . హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జగన్ పై విమర్శలు కూడా చేశారు. అప్పట్లో కాంగ్రెస్ నుంచి జగన్‌తో వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని, వీటికి సంబంధించిన ఉప ఎన్నికల్లో షర్మిల వారిని దగ్గర ఉంది గెలిపించారని సునీత తెలిపారు. ఆ తర్వాత ఆమెకి ఆదరణ వస్తోందని పక్కన పెట్టారని ఆరోపించారు.
“2014 ఎన్నికల్లో కడప నుంచి షర్మిల పోటీ చేస్తే ప్రమాదమని విశాఖకి పంపాలని నిర్ణయించారు. పులివెందులలో అవినాష్ కుటుంబం వెన్నుపోటుతో వివేకా ఓటమిపాలైన విషయం స్పష్టమైంది. అనంతరం వివేకా ఓటును కూడా తొలగించారు. హత్యా రాజకీయాలు చేసే వారివైపు ఉంటారో న్యాయం కోసం పోరాడుతున్న తమ వైపు ఉంటారో ప్రజలే తేల్చుకోవాలి. తన తండ్రి హత్యకి కారకులైన వారికి త్వరలోనే శిక్ష పడుతుంది” అని వైఎస్ సునీత ఆశాభావం వ్యక్తం చేశారు.