జనం నిలదీసారని…అలిగి వెళ్ళిపోయిన తాజా మాజీ ఎమ్మెల్యే

Trs Mla Came Back After Protest From Villagers

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు ముమ్మర ప్రచారం సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు గ్రామస్థుల నుంచి ఊహించని అనుభవం ఎదురయ్యింది. తమ గ్రామానికి ఏంచేశారో చెప్పాలంటూ వారు నిలదీయడంతో ఆయన ఒకింత అసహనానికి గురయ్యారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం తలమడుగు మండలం కుచులాపూర్‌ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బోథ్‌ తాజా మాజీ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావును గ్రామస్థులు నిలదీశారు.

TRS Ex MLA Rathod Bapurao

ఈ నాలుగేళ్లలో మా ఊరికి ఏం మేలు చేశారని ఓట్లడగటానికి వచ్చారంటూ ప్రశ్నించారు. అంతకు ముందు గ్రామంలోని సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన బాపురావు అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలను వివరిస్తుండగా కొందరు యువకులు కలుగజేసుకున్నారు. మా ఊరికి ఏం చేశారో చెప్పాలని, గతంలో ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు. చెరువు మంజూరు చేస్తామన్నారని, అలా చేసుంటే మీ విగ్రహం పెట్టే వాళ్లమన్నారు. గ్రామస్థులు నిలదీసేసరికి ఒకింత అసహనానికి గురైన బాపురావు గ్రామాభివృద్ధికి తనవంతు కృషి చేశానని అన్నారు. ఆలయంలో పూజలు చేయడానికి వచ్చాను తప్ప, ఓట్లడగడానికి రాలేదని వ్యాఖ్యానించారు. ఇక నుంచి మీ ఊర్లో ఓట్లడగటానికి రానంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామంలో ప్రచారం నిర్వహించకుండానే తిరిగి వెళ్లిపోయారు. అయినా వోట్లు వేయాల్సిన వారి మీద అలిగితే ఎవరికి నష్టం చెప్పండి.