Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అసెంబ్లీ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విసిరిన హెడ్ ఫోన్స్ మండలి చైర్మన్ స్వామిగౌడ్ కు తగిలి… ఆయన కన్నుకు గాయమమయిందని ఆరోపిస్తున్న టీఆర్ ఎస్ ప్రభుత్వం… ఈ ఉదయం కఠిన చర్యలు ప్రకటించింది. స్వామిగౌడ్ పై హెడ్ సెట్ విసిరారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు సంపత్ కుమార్ ల సభ్యత్వాలను రద్దు చేస్తున్నట్టు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. మిగిలిన 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు… జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, గీతారెడ్డి, చిన్నారెడ్డి, డీ.కె. అరుణ, టి. రామ్మోహన్ రెడ్డి, డి. మాధవరెడ్డి, వంశీచంద్ లపై ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకూ సస్పెన్షన్ వేటువేశారు.
ఈ ఉదయం సభ ప్రారంభమైన తర్వాత శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్ రావు సోమవారం ఘటనను అరాచక చర్యగా అభివర్ణించారు. అనంతరం రెండు తీర్మానాలు ప్రవేశపెట్టారు. 11 మంది కాంగ్రెస్ సభ్యులను ఈ సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తూ తొలి తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వాన్ని రద్దు చేస్తూ మరో తీర్మానాన్ని సభ ముందుంచగా… మూజువాణీ వోటుతో అవి ఆమోదం పొందాయి. అనంతరం సస్పెండైన సభ్యులు సభను వీడాలని స్పీకర్ కోరారు. మండలి చైర్మన్ పై జరిగిన దాడి చూసి తాను షాక్ కు గురయ్యానని, నాలుగు సంవత్సరాల తెలంగాణ శాసనసభ చరిత్రలో ఈ ఘటన ఓ మచ్చగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. మాటల్లో వర్ణించలేని ఆవేదన తన మనసులో ఉందని, తాము వేసిన శిక్ష చిన్నదేనని అన్నారు.
సస్పెండ్ కు గురైన, సభ్యత్వాన్ని పోగొట్టుకున్న కాంగ్రెస్ నేతలు బయటకు వెళ్లాలని లేదంటే మార్షల్స్ ను పిలవాల్సి వస్తుందని హెచ్చరించారు. క్లిప్పింగ్స్ అన్నీ చూసి కావాలనే ఉద్దేశపూర్వకంగా కొందరు సభ్యులు ఇలా చేశారనే నిర్ణయానికి తానొచ్చినట్టు స్పీకర్ వెల్లడించారు. తాను హెడ్ ఫోన్స్ ను ఎవరి టార్గెట్ గానో విసరలేదని, తాను విసిరిన హెడ్ ఫోన్స్ స్వామిగౌడ్ కు తగిలినట్టు సాక్ష్యం చూపితే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని కోమటిరెడ్డి సవాల్ విసిరినా పట్టించుకోకుండా… టీఆర్ ఎస్ ప్రభుత్వం తన నిర్ణయం అమలుచేసింది. తమ చర్యను ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థించుకున్నారు. సభ సరైన నిర్ణయం తీసుకుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తులు సభలో ఉండాల్సిన అవసరంలేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.