Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా… ప్రజల్లోకి దూసుకెళ్తోందని, కేంద్రంపై అవిశ్వాసం పెట్టడానికి పవన్ కళ్యాణే కారణమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు రాసిన ఎవరి రాజధాని అమరావతి అన్న పుస్తకాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉండవల్లితో పాటు సీపీఐ నేత రామకృష్ణ, సీపీఎం నేత మధు, సీనియర్ రాజకీయవేత్త వడ్డే శోభనాద్రీశ్వరరావు, పుస్తకరచయిత ఐవైఆర్ పాల్గొన్నారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో రాసిన పుస్తకాన్ని ఐవైఆర్ వడ్డే శోభనాద్రీశ్వరరావుకు అంకితమిచ్చారు. పుస్తకాన్ని ఆయనకు అంకితమివ్వడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఉండవల్లి చెప్పారు.
ఈ పుస్తకం చదవగానే రాజధాని అంటే ఏమిటి? ఏ దేశంలో ఏ రాజధాని ఎలా నిర్మించారు? ఆయా రాజధానుల బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అనే విషయాలు తెలుస్తాయన్నారు. అవినీతి మచ్చలేని, నిజాయితీ గల ఐవైఆర్ కు అన్ని విషయాలూ తెలుసని, ఆయన నిజం చెబుతోంటే ద్రోహులు, దుర్మార్గులు, ప్రభుత్వానికి వెన్నుపోటు పొడుస్తున్నారని, ఆయనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఉండవల్లి ఆగ్రహం వ్యక్తంచేశారు. పవన్ మాట్లాడితే ఇన్నేళ్లకు నీకు మెలకువ వచ్చిందా అంటున్నారని, అసలు చంద్రబాబుకు, బీజేపీకి మధ్య ఉన్న గొడవేంటో చెప్పాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. ఈ పాచిపోయిన లడ్డూలతో సర్దుకుపోవాలా అని పవన్ ఎప్పుడో ప్రశ్నించారని, ఈ సమయంలో పవన్ రాజకీయాల్లోకి రావడం పెద్ద రిస్క్ అని, ఆయన్న ఆశీర్వదించాల్సిన అవసరం అందరిపైనా ఉందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఒక మనిషి దెబ్బలాడేందుకు బయటకు వచ్చినప్పుడు ఆ మనిషి వెనక మనం నిలబడకపోతే మనకు మనమే ద్రోహం చేసుకున్నవాళ్లమవుతామని, ఆ ద్రోహం చేయవద్దని ఉండవల్లి కోరారు.