Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ఆయన హిందీలో ప్రమాణం చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పార్లమెంటులోని దర్బార్ హాల్ లో ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోడీ, బీజేపీ కురువృద్ధుడు అద్వానీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల గవర్నర్లు , ఎంపీలు, అనేక పార్టీల అధినేతలు హాజరయ్యారు. అనంతరం ఆయన రాజ్యసభ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు వెంకయ్య రాజ్ ఘాట్లో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు.
ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన వెంకయ్య నాయుణ్ణి ప్రధానమంత్రి రాజ్యసభలో మాట్లాడుతూ ప్రశంసల్లో ముంచెత్తారు. రాజ్యసభ కార్యకలాపాలు ప్రారంభించిన వెంకయ్య నాయుడుకి స్వాగతం పలికన మోడీ ఆయన గురించి చాలాసేపు మాట్లాడారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఉపరాష్ట్రపతి కావటం అభినందనీయమన్నారు. రాజ్యసభలో సుదీర్ఘ కాలం సభ్యుడిగా ఉన్న వెంకయ్యనాయుడు..ఇదే సభకు చైర్మన్ అయ్యారని, రైతుబిడ్డ ఉపరాష్ట్రపతి కావటం దేశానికి గర్వకారణమని మోడీ చెప్పారు. దేశ చరిత్రలో తొలిసారి గ్రామాల్లో జన్మించిన వ్యక్తులు ఒకే సారి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారని…ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది నిదర్శనమని మోడీ అన్నారు. వెంకయ్య నాయుడు ఏ భాషలోనయినా అనర్గళంగా మాట్లాడగలరని, ఆయనలా మాట్లాడటం అందరికీ సాధ్యం కాదని కొనియాడారు.
తెలుగులో ఆయన సూపర్ ఫాస్ట్ గా మాట్లాడుతూనే ప్రేక్షకులను ఆకట్టుకుంటారని ప్రధాని అన్నారు. రాజ్యసభ గురించి వెంకయ్యకు సంపూర్ణంగా తెలుసని, న్యాయవాది న్యాయమూర్తి అయినట్టుగా వెంకయ్య రాజ్యసభ చైర్మన్ అయ్యారని…మోడీ వ్యాఖ్యానించారు. ఆయన సభను హుందాగా నడుపుతారని మోడీ ఆశాభావం వ్యక్తంచేశారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వెంకయ్య గ్రామీణాభివృద్ధి కోసం చాలా కృషిచేశారని , రైతుల కష్టాల గురించి ఆయనకు బాగా తెలుసని, వ్యవసాయ రంగ సమస్యలను బాగా అర్ధం చేసుకోగలరని మోడీ ప్రశంసించారు. ప్రధానమంత్రి సడక్ యోజనను వెంకయ్యనాయుడే ప్రారంభించారని మోడీ తెలిపారు. బీజేపీలోనూ, కేంద్ర ప్రభుత్వంలోనూ ఏ పదవి చేపట్టినా…ఆ పదవికే వన్నె తెచ్చిన వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగానూ తనదైన ముద్ర వేయనున్నారు.
మరిన్ని వార్తలు: