ఢిల్లీలోని ఏపీ భవన్ లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మళ్ళీ నియమితులయ్యారు. మొన్ననే కదా ఏపీ ప్రభుత్వం ఆయన నియామకాన్ని రద్దు చేసింది అనుకుంటున్నారా. పదవి నుంచి తొలగించిన మాట నిజమే కానీ మళ్లీ ఆయనకు అదే పదవిని కట్టబెట్టింది. అందుకు తగ్గ ఉత్తర్వులు కూడా నిన్న జారీ అయ్యాయి. నిబంధనలు కొన్ని అడ్డుగా మారడంతో ఈసారి జాగ్రత్తలు పాటించి విజయసాయిని ప్రతినిధిగా నియమించారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం విజయసాయికి ఎలాంటి జీత భత్యాలు, కేబినెట్ ర్యాంకు లేకుండా నియమించినట్టు అధికార వర్గాల నుండి అందుతున్న సమాచారం. సేవా భావంతోనే ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విజయసాయిరెడ్డి వ్యవహరించనున్నారట. ఆయనకు ఎటువంటి అధికారిక సదుపాయాలను కల్పించడం లేదని పేర్కొన్నారు. జూన్ 22న విజయసాయిరెడ్డిని కేబినెట్ ర్యాంకుతో ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా అప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ మరో లాభదాయక పదవి (ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్) చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని తేలడంతో విజయసాయిరెడ్డి నియామకాన్ని ఈనెల 4న రద్దు చేశారు. ప్రత్యేక ప్రతినిధిగా ఎలాంటి జీత భత్యాలు, కేబినెట్ హోదా లేకుండానియమించేందుకు వీలుగా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనల్లో సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆర్డినెన్స్ జారీ చేసిందట. ఆర్డినెన్స్‌పై గవర్నర్ సంతకం చేయడంతో తాజాగా నియామకం జరిగిందని సమచారం. ఉత్తర్వులు తక్షణం అమల్లోకి రానున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.