తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడంతో ప్రచారం కోసం కాంగ్రెస్ పలు కీలక కమిటీలను నియమించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ప్రచార కమిటీలో ఒకప్పటి హీరోయిన్ విజయశాంతిని స్టార్ క్యాంపెయినర్‌గా కాంగ్రెస్ నియమించింది. తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల ప్రచార కమిటీ సలహాదారు బాధ్యతల్ని అప్పగించింది. దీంతో మరోసారి విజయశాంతి పేరు తెలంగాణలో మారుమోగుతోంది. దీంతో తాజాగా ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన విజయశాంతి చిరంజీవి, పవన్ కళ్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు వేరు వేరు పార్టీల్లో ఉన్న చిరంజీవి, విజయశాంతి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు టీఆర్ఎస్ నేతగా ఉన్న విజయశాంతి ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు.
అయితే ఇప్పుడు ఈ ఇద్దరు ఒకే పార్టీ(కాంగ్రెస్)లో ఉన్నారు. తెలంగాణలో వీరిద్దరూ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఈ ఇంటర్వ్యూలో విజయశాంతిని మహాకూటమిగా ఏర్పడ్డారు కాబట్టి సినీ రంగానికి చెందిన మీరు, చిరంజీవి, బాలకృష్ణ మరికొందరు కలిసి ప్రచారానికి వెళ్లే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు విజయశాంతి స్పందిస్తూ.. ‘మిగిలిన వాళ్లంతా ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో ఉన్నారు. వాళ్లు అటు ఆంధ్రలో ఉన్నారు. మేం ఇటు తెలంగాణలో ఉన్నాం. ఎవరి బిజీలో వాళ్లు ఉంటారు. ఎవరి ఆలోచన వాళ్లకు ఉంటుంది. అంతకు మించి తెలీదని హై కమాండ్ నిర్ణయం మేరకు చిరంజీవి ప్రచారానికి వస్తే కలిసి పనిచేయడానికి సిద్ధమే అన్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ఆయనకు ఆవేశం ఎక్కువ అని, రాజకీయాల్లో ఆయన సక్సెస్ అవుతారో లేదో చూడాలన్నారు.