నటీనటులు: మంచు లక్ష్మీ, శ్రీకాంత్ అయ్యంగార్, ప్రియదర్శి, ఆదర్శ్, సామ్రాట్ తదితరులు
సంగీతం : రఘు దీక్షిత్
దర్శకత్వం : విజయ్ ఎలకంటి
నిర్మాతలు : టీజీ విశ్వప్రసాద్, మంచు లక్ష్మీ
కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: విజయ్ యలకంటి
కథ… దీక్ష భర్త అనూహ్యంగా చనిపోతాడు. ఆ దుఃఖాన్ని దిగమిగే లోపే ఓ ఆక్సిడెంట్ తో కడుపులో వున్న బిడ్డని కూడా పోగొట్టుకుంటుంది. ఈ పరిస్థితుల మధ్య భర్త మరణం సాధారణం కాదని తెలుస్తుంది. అయితే పోలీసుల దర్యాప్తు నత్తనడకన సాగుతుంది. అయినా ధైర్యం తెచ్చుకున్న దీక్ష తానే రంగంలోకి దిగి ఆ మిస్టరీ చేధించాలి అనుకుంటుంది. ఆ ప్రయాణంలో ఆమెకు అనుకోని పరిస్థితులు ఎదురు అవుతాయి. మర్డర్ మిస్టరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. చివరకు ఏమి జరిగింది అన్నదే మిగిలిన కథ.
విశ్లేషణ …వైఫ్ అఫ్ రామ్ కథ గురించి తెలియగానే ముందుగా అందరి మనస్సులో హిందీలో వచ్చిన అనామిక మెదులుతుంది. అయితే ఆ కధకు,దీనికి సంబంధం లేదని దీక్ష పాత్ర చేసిన మంచు లక్ష్మి చెప్పిన మాట అక్షరాలా నిజం. వైఫ్ అఫ్ రామ్ అచ్చమైన థ్రిల్లర్. అనామిక సినిమా ప్రధానంగా వ్యవస్థ లోపాల్ని టార్గెట్ చేస్తే ఇందులో మనుషుల స్వార్ధం గురించి చర్చించారు. థ్రిల్లర్ కి తగినట్టు కధలో వచ్చే మలుపులు ప్రేక్షకుడి ఊహకు అందకుండా నూతన దర్శకుడు విజయ్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో కథ మొదలైన వెంటనే ముందు ముందు ఏమి జరుగుతుందో అన్న ఉత్కంఠ మొదలు అవుతుంది. అయితే మలుపుల వేగంలో దీక్ష పాత్ర మీద ప్రేక్షకుల్లో సహానుభూతి రగల్చడంలో దర్శకుడు పెద్దగా దృష్టి పెట్టినట్టు అనిపించలేదు. ఇక ఈ థ్రిల్లర్ నిడివి రెండు గంటలే అయినప్పటికీ ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా సన్నివేశాలు సాగదీసినట్టు అనిపించింది. మొత్తానికి తెలుగు సినిమాలు అంటే ఇలాగే ఉండాలి అనే ప్రేక్షకులకి ఈ సినిమా ఎక్కడం కష్టం. అయితే ఇప్పుడు వస్తూన్న కొత్త తరహా ఆలోచనలకు పట్టం కట్టే సినిమాల ఒరవడికి తగినట్టు వుంది. కొత్తదనం కోరుకునే వాళ్ళని వైఫ్ అఫ్ రామ్ ఏ మాత్రం నిరుత్సాహపర్చదు.
మంచు లక్ష్మి ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా వైఫ్ అఫ్ రామ్. దీక్ష పాత్ర పోషణలో ఆమె పడ్డ కష్టం కనిపించింది. సినిమా సినిమాకి ఆమె నటన లో పరిణితి వస్తోంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఆ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఇందులో లక్ష్మి మంచుకు సహాయపడే యంగ్ పోలీస్ అధికారి పాత్రలో ప్రియదర్శి, బాడ్ బాయ్ పాత్రలో ఆదర్శ్ కూడా ప్రేక్షకులకి గుర్తు ఉండిపోతారు.
దర్శకుడు విజయ్ కి మున్ముందు మంచి భవిష్యత్ ఉంటుంది అనడంలో సందేహం లేదు. మ్యూజిక్ డైరెక్టర్ రఘు దీక్షిత్ ఈ సినిమాకి ప్లస్. థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమా అర్బన్ బేస్డ్ ప్రేక్షకులకి ఎక్కువగా రీచ్ అవుతుంది.
తెలుగు బులెట్ పంచ్ లైన్ ..”.వైఫ్ అఫ్ రామ్” మలుపులు తిరిగింది కానీ …
తెలుగు బులెట్ రేటింగ్ …2 .75 /5 .