Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విజయవాడలో వైసీపీ రాష్ట్ర కార్యాలయ ప్రారంభ వేడుకల్లో ఆ పార్టీ అధినేత జగన్ పాల్గొనకపోవడం మీద చర్చ సాగుతూనే వుంది. ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదని వైసీపీ నాయకులు అంటున్నారు. ఇంకా ముఖ్యమైన పనులు ఇంతకుముందే ఫిక్స్ అయివుండడంతో ఆయన పూజలకు రాలేదని చెబుతున్నారు. అంతకన్నా ముఖ్యమైన సంగతి ఇంకోటి వుంది. ప్రస్తుతం విజయవాడలో ఏర్పాటు చేసింది కూడా తాత్కాలిక కార్యాలయమే. పార్టీ సీనియర్ నాయకుడు కె.పార్థసారథికి చెందిన స్థలంలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయం కొన్నాళ్ళు మాత్రమే వినియోగిస్తారు. ఇంతలో జగన్ ఏరికోరి ఎంచుకున్న తాడేపల్లి లో వైసీపీ శాశ్వత పార్టీ కార్యాలయం అందుబాటులోకి వస్తుందట.
విజయవాడ , గుంటూరు, అమరావతి, మంగళగిరి వదిలిపెట్టి జగన్ తాడేపల్లికి ఫిక్స్ కావడం వెనుక గట్టి కారణాలే వున్నాయి. ఇప్పుడు రాజధానిగా ఎంపిక చేసిన ప్రాంతంలో టీడీపీ బలంగా కనిపిస్తోంది. విజయవాడ, గుంటూరు అయినా సరే అంతకు భిన్నమైన వాతావరణం ఏమీ లేదు. కానీ ఉండవల్లి, తాడేపల్లి లాంటి రెండు మూడు ఊళ్లలో సామాజిక, రాజకీయ పరిస్థితులు వైసీపీ కి అనుకూలంగా వున్నాయి. ఇక ఉండవల్లి దగ్గర సీఎం చంద్రబాబు గెస్ట్ హౌస్ ఉండటంతో జగన్ ఇంకో ఆప్షన్ చూసుకోవాల్సి వచ్చింది . రాజధానికి భూములు ఇచ్చే విషయంలో తాడేపల్లి రైతులు ఎక్కువమంది వైసీపీ కి అండగా వుంటున్నారు. జగన్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా ఇక్కడ చెప్పుకోదగ్గ సంఖ్య లో వున్నారు. ఈ కారణాలతో జగన్ తాడేపల్లికి ఫిక్స్ అయ్యారు. ఇక్కడ పార్టీ కార్యాలయమే కాకుండా సొంత ఇంటిని కూడా నిర్మించుకునే ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది.